కేసీఆర్ స్కెచ్ అదిరింది

తెలంగాణ‌ను బంగారు తెలంగాణ చేయాల‌న్న సీఎం కేసీఆర్ సంక‌ల్పం నెర‌వేర‌బోతోందా? కొత్త జిల్లాల ఏర్పాటుతో తెలంగాణ భ‌విష్య‌త్తు మారిపోనుందా? కేంద్రం నుంచి భారీ ఎత్తున నిధులు వ‌ర‌ద‌లై పార‌నున్నాయా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. జిల్లాల ఏర్పాటు అంశంపై వెల్లువెత్తిన ఆందోళ‌న‌లు స‌ద్దుమ‌ణిగి 10 జిల్లాల తెలంగాణ ఇప్పుడు 31 జిల్లాల మ‌హా తెలంగాణ‌గా అవ‌త‌రించ‌బోతోంది. దీంతో జిల్లాలు, మండ‌లాలు, పంచాయ‌తీల రూపు రేఖ‌లు స‌మూలంగా మారిపోనున్నాయి. అదేస‌మ‌యంలో పాల‌న క్షేత్ర‌స్థాయికి చేరుకునేలా ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లూ చేప‌ట్ట‌నుంది. అధికారుల సంఖ్య రెట్టింపు కానుంది.

జిల్లాల సంఖ్య పెరుగుతుంది కాబ‌ట్టి.. ఆయా జిల్లాల్లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌నకు ప్ర‌భుత్వం పెద్ద పీట వేయ‌నుంది. దీంతో పూర్తిగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ప‌థాన సాగ‌నుంద‌న‌డంలో ఎలాంటి సందేహ‌మూలేదు. ఇక‌, ఇంత‌పెద్ద కార్య‌క్ర‌మం సాకారానికి పెద్ద ఎత్తున నిధులు కూడా స‌మ‌కూర్చాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు రాబ‌ట్టేందుకు కేసీఆర్ ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌ణాళికా సంఘాన్ని ఎత్తేసిన కేంద్రంలోని మోడీ స‌ర్కారు దాని స్థానంలో నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేసింది. ఇది ఇచ్చిన సూచ‌న‌ల మేర‌కు దేశంలోని వెనుక‌బ‌డిన జిల్లాల‌కు మొత్తం 5 ఏళ్ల‌కాలంలో ఒక్కొక్క జిల్లాకు రూ.50 కోట్లు చొప్పున విడుద‌ల చేయ‌నుంది.

ఈ మేర‌కు ఏపీ విభ‌జ‌న చ‌ట్టంలోనే పొందుప‌రిచారు. తెలంగాణ‌లో విభ‌జ‌న నాటికి మొత్తం 10 జిల్లాలు ఉండ‌గా.. ఒక్క హైద‌రాబాద్ మిన‌హా మిగిలిన 9 జిల్లాల‌కు కేంద్రం నుంచి రూ.50 కోట్ల చొప్పున నిధులు అంద‌నున్నాయి. అయితే, ఇక్క‌డే కేసీఆర్ స‌ర్కారు వ్యూహాత్మ‌క అడుగులు వేసింది. జిల్లా విభ‌జ‌న‌తో ఏర్ప‌డిన మొత్తం 31 జిల్లాల్లో హైద‌రాబాద్‌ను మిన‌హాయిస్తే.. 30 జిల్లాల‌కు కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు స‌మీక‌రించాల‌ని వెనుక బ‌డిన జిల్లాల‌ను అభివృద్ది చేయాల‌ని నిర్ణ‌యించింది. అయితే, విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం 9 జిల్లాల‌కే కేంద్రం నుంచి నిధులు అంద‌నున్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

కానీ కేసీఆర్ మాత్రం ఇప్పుడు ఏర్ప‌డిన జిల్లాలు కూడా అలా వెనుక‌బ‌డిన జిల్లాల నుంచి పుట్టిన‌వేక‌దా? నిధులు ఎందుకు ఇవ్వ‌రు ? అని నిల‌దీసే అవ‌కాశం ఉంది. ఆ లెక్క‌న చూసుకుంటే మొత్తంగా 30 జిల్లాల‌కు ఒక్కొక్క దానికి రూ.50 కోట్ల వంతున మొత్తం 1500 కోట్లు అందే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ‌.. కేంద్రం ఇలా ఇవ్వ‌క‌పోతే.. రానున్న ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీకి వ్య‌తిరేకంగా ఈ అంశాన్ని పెద్ద ఎత్తున టీఆర్ ఎస్ ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లే ఛాన్స్ క‌నిపిస్తోంద‌ని పొలిటిక‌ల్ విశ్లేష‌కులు చెబుతున్నారు.

కాబ‌ట్టి ఈ విష‌యంలో కేసీఆర్ వ్యూహం గ‌ట్టిగానే వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని అంటున్నారు. కేంద్రం నుంచి నిధులురాబ‌ట్టి జిల్లాల‌ను అభివృద్ధి చేయ‌డం ద్వారా తెలంగాణ చ‌రిత్ర‌లో కేసీఆర్ ఓ ప్ర‌త్యేక అధ్యాయానికే శ్రీకారం చుట్ట‌నున్నార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. కేంద్ర‌మే క‌నుక కేసీఆర్ ప్లాన్ ప్ర‌కారం నిధులు ఇస్తే.. నిజంగానే ఆయా జిల్లాల్లో నిధుల వ‌ర‌ద పార‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.