కేసీఆర్‌కు కొత్త త‌ల‌నొప్పి…. 33 జిల్లాలు కావాలి

తెలంగాణ ను బంగారు తెలంగాణ చేయాల‌న్న టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ వ్యూహం కాస్తా.. తెలంగాణ‌ను జిల్లాల తెలంగాణ‌గా మారుస్తోందా ? అనిపిస్తోంది! వాస్త‌వానికి పాల‌న సౌల‌భ్యం కోసం, ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ కావ‌డం కోసం, కొత్త నాయ‌కులు, నేత‌లు వ‌స్తార‌ని భావించిన కేసీఆర్ ప్ర‌స్తుత‌మున్న ప‌ది జిల్లాల రాష్ట్రాన్ని 25 జిల్లాలు చేయాల‌ని నిర్ణ‌యించారు. వీటిలో ముఖ్యంగా పెద్ద పెద్ద జిల్లాలుగా ఉన్న‌వాటిపై ఆయ‌న తొలుత దృష్టి పెట్టారు. ఇక‌, ఆ త‌ర్వాత దీనికి రాజ‌కీయ రంగు పులుముకుంది. కేవ‌లం టీడీపీ, కాంగ్రెస్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న జిల్లాల‌నే కేసీఆర్ విడ‌గొడుతున్నాడ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది.

ఈ క్ర‌మంలో త‌మకు జిల్లా కావాలంటే త‌మ‌కు జిల్లా కావాల‌ని నేత‌లు మూకుమ్మ‌డిగా ఆందోళ‌న‌ల‌కు దిగారు .ఈ క్ర‌మంలో ఈ సంఖ్య 27 ఆ త‌ర్వాత ఇప్పుడు 31కి చేరింది. తాజాగా 31 జిల్లాల ఏర్పాటుకు కేసీఆర్ ప‌చ్చ‌జెండా ఊపారు. గ‌తంలోనే 27 జిల్లాల‌కు సంబంధించి ఉత్త‌ర్వులు జారీ చేయ‌డం, ప్ర‌జాభిప్రాయం కోర‌డం జ‌రిగిపోయాయి. అయితే, తాజాగా తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కారం ఆసిఫాబాద్‌, గ‌ద్వాల్‌, సిరిసిల్ల‌, జ‌న‌గామ‌ను కూడా జిల్లాలు చేస్తున్నారు. ఇంత‌టితో ఈ జిల్లాల గోల‌కు తెర‌ప‌డుతుంద‌ని, తాను ప్ర‌శాంతంగా పాల‌న సాగించొచ్చ‌ని కేసీఆర్ అనుకున్నారు.

కానీ, జిల్లాల గొడ‌వ ఇప్ప‌ట్లో చ‌ల్లారేలా క‌నిపించ‌డం లేదు.తాజాగా, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకే చెందిన నారాయ‌ణ్‌పేట్  ఎమ్మెల్యే త‌న ప్రాంతాన్ని కూడా జిల్లాగా ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేయ‌డంతోపాటు.. చివ‌రి నిమిషంలో గ‌ద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ బాటనే ఆయ‌న ఎంచుకున్నారు. జిల్లాగా ప్ర‌క‌టించ‌క‌పోతే తాను ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని చెప్పారు. వాస్త‌వానికి ఈయ‌న టీడీపీ త‌ర‌ఫున 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికైనా త‌ర్వాత కారెక్కేశారు.దీంతో ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేనే జిల్లా కోసం రాజీనామా బాట ప‌డితే.. కేసీఆర్ ఇమేజ్ దెబ్బ‌తినే ప్ర‌మాదం పొంచి ఉంది. కాబ‌ట్టి మ‌రో జిల్లాను ఏర్పాటు చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది. అదేవిధంగా .. వరంగ‌ల్ జిల్లాకు చెందిన మంత్రి చందూలాల్ కూడా ఇప్పుడు తెర‌మీద‌కి వ‌చ్చారు.

తన నియోజకవర్గం ములుగు కేంద్రంగా జిల్లా వస్తుందని అనుకున్నానని అన్యాయం జరిగిందని అంటూ మంత్రి సీఎంతో మొర పెట్టుకున్న‌ట్టు  వార్తలు వచ్చాయి. ఇక‌, మంత్రిస్థాయి వారే జిల్లా కోసం క‌న్నీటి ప‌ర్యంత‌మైతే.. కేసీఆర్ క‌రిగిపోకుంటా ఉంటారా? అదే జ‌రిగింది. తొలుత చందూలాల్‌ని స‌ముదాయించిన కేసీఆర్‌.. ములుగును జిల్లా చేసేందుకు అవ‌కాశం లేద‌ని చెప్పారంట‌. కానీ, ఆయ‌న ప‌ట్టుబ‌డితే మాత్రం ఇవ్వ‌క‌త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో ఇప్పుడు తెలంగాణ 31 జిల్లాలు కాకుండా 33 జిల్లాల మ‌హా తెలంగాణ‌గా అవ‌త‌రించే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు!  మ‌రి ద‌స‌రాకు నాటికి జిల్లాల ఏర్పాటు విష‌యంలో ఎన్ని చిత్ర విచిత్రాలు జ‌రుగుతాయో చూడాలి.