హోదా లేదు, అసలు ప్యాకేజీ రాదు!

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా లేనే లేదు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పాక ఇంకా హోదాపై ఆశలు పెట్టుకోవడం అనవసరం. ప్రత్యేక హోదా వస్తుందని ఆయన చెబితేనే, అందులో నిజం లేదన్నట్టు. ఆయనే లేదని చెబితే, ఇక అస్సలు అక్కడ హోదా గురించిన చర్చే లేదని అర్థం. ప్రత్యేక ప్యాకేజీ ఏదో తయారవుతోందని సుజనా చౌదరి చెబుతున్నా, అది నమ్మదగ్గదిగా కనిపించడంలేదు. ఎందుకంటే ప్యాకేజీ అంటేనే అదొక మాయ. విభజన కారణంగా ఏర్పడ్డ లోటు బడ్జెట్‌ని కేంద్రం భర్తీ చేయాలి. దాన్ని కూడా ప్యాకేజీలో కలిపేస్తారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లకు సంబంధించి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఓ ప్రకటన చేశారు.

ఆ ప్రాజెక్టులకు అయ్యే వేల కోట్ల ఖర్చు కూడా ప్యాకేజీలో కలిసిపోతుంది.పోలవరం ప్రాజెక్టు సహా అనేక అంశాల్ని కూడా ప్యాకేజీలో కలిపేసి, గుండు సున్నా చుట్టేస్తారు. నిజానికి ప్యాకేసీ ఉన్నా లేకున్నా కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌ని ఆదుకోడానికి ఆ నిధులన్నిటినీ ఖర్చు చేయాలి. ప్యాకేజీ ప్రకటిస్తే ఉండే అడ్వాంటేజ్‌ ఏంటంటే, దానికి కాలపరిమితి ఉండదు. ప్రభుత్వాలు మారినా, ఆ ప్యాకేజీ అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. అందుకనే చంద్రబాబు కొంచెం ఆలస్యంగానే అయినా ప్రత్యేక హోదానే కావాలని బెట్టు చేయడం ప్రారంభించారు. ప్రత్యేక హోదా వస్తే, ప్యాకేజీతో పాటు మిగతావి కూడా వస్తాయి. రెండేళ్ళ నుంచి ఈ అంశం చుట్టూనే చంద్రబాబు పోరాటం చేసి ఉంటే బాగుండేది.