స్టార్‌ స్టార్‌ పవర్‌ స్టార్‌.

ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాలు వపర్‌ స్టార్‌ మేనియాలో ఊగిపోతున్నాయి. ఈ రెండు జిల్లాలో పవన్‌కళ్యాణ్‌కి అభిమానులు ఇతర జిల్లాలతో పోల్చితే చాలా ఎక్కువ. ఈ జిల్లాల్లోని కాపు సామాజిక వర్గం పూర్తిగా పవన్‌కళ్యాణ్‌ వెంట నడిచేందుకు ఆస్కారం ఉంది. జనసేన పార్టీ పెట్టిన తర్వాత తొలిసారిగా అత్యంత వ్యూహాత్మకంగా పవన్‌కళ్యాణ్‌ ఏర్పాటు చేసిన బహిరంగ సభ శుక్రవారం జరగనుంది. దీనికోసం భారీ ఏర్పాట్లు చేశారు. సభకు హాజరయ్యేందుకు ఓ రోజు ముందుగానే కాకినాడ చేరుకున్న పవన్‌కళ్యాణ్‌కి అభిమానులు ఘనస్వాగతం పలికారు. లక్ష మంది వరకూ బహిరంగ సభ ప్రాంగణంలో పట్టేందుకు ఆస్కారం ఉండగా, రెండు నుంచి మూడు లక్షల మంది వరకూ అభిమానులు, జనసేన మద్దతుదారులు ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలియవస్తోంది.

ఓ వైపు సినిమా గ్లామర్‌, ఇంకో వైపు పొలిటికల్‌ గ్లామర్‌తో, కాకినాడ సభతో పవన్‌కళ్యాణ్‌ కొత్త చరిత్ర సృష్టించబోతున్నారని అభిమానులు అంటున్నారు. అకస్మాత్తుగా తిరుపతిలో అప్పటికప్పుడు బహిరంగ సభ నిర్వహిస్తేనే 50 వేల మందికి పైన హాజరయ్యారట. అలాంటిది ముందస్తు సన్నాహాలతో బహిరంగ సభ నిర్వహిస్తున్నప్పుడు రెండు మూడు లక్షల మంది హాజరవడం పెద్ద వింత కాబోదు. ఈ సభ నుంచి పవన్‌కళ్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి అల్టిమేటం జారీ చేస్తారో వేచి చూడాలిక.