సెక్స్‌ స్కాండల్‌: ప్రభుత్వాన్ని కూల్చేస్తుంది.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కి రాజకీయంగా చాలా పెద్ద ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఇప్పటికే అవినీతి ఆరోపణలు, ఇతర ఆరోపణల కారణంగా కొందరు ముఖ్య నేతల్ని అరవింద్‌ కేజ్రీవాల్‌ పోగొట్టుకున్నారు. అయితే వారిని తొలగించడం వల్ల తన నిజాయితీ బయటపడుతుందని ఆయన అనుకుని ఉండొచ్చు. ఈ క్రమంలోనే సెక్స్‌ స్కాండల్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి సందీప్‌కుమార్‌ని తొలగించారు అరవింద్‌ కేజ్రీవాల్‌. అయితే ఇదివరకటిలా ఆయన తప్పించుకోవడానికి వీల్లేకుండా పోతోంది. దేశవ్యాప్తంగా రాజకీయాల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌ మంత్రి వర్గంలోని ఓ మంత్రి సెక్స్‌ స్కాండల్‌లో ఇరుక్కుపోవడంపై చర్చ జరుగుతోంది. ప్రజల ముందుకు అతి నీతివంతమైన పార్టీగా వచ్చిన ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఇటువంటి వ్యక్తులకు ఎలా టిక్కెట్లు ఇచ్చిందని ప్రశ్నిస్తున్నారు ప్రజలు.

అలాగే, అవినీతిపరులు, అశ్లీల కార్యక్రమాలకు ఒడిగట్టేవారిని మంత్రులుగా కేజ్రీవాల్‌ తీసుకోవడం వెనుక పెద్ద రాజకీయ కుట్ర నడిచిందని, ఇది ప్రజల్ని వంచించడమేనని అభిప్రాయాలు వినవస్తున్నాయి. ఇప్పటివరకూ ఎప్పుడూ తన మంత్రివర్గంలోని లుకలుకలు తనను రాజకీయంగా ఇబ్బంది పెడతాయని ఆలోచించని కేజ్రీవాల్‌, సందీప్‌కుమార్‌ సెక్స్‌ స్కాండల్‌తో కొంచెం బెదిరిపోవాల్సి వస్తోంది. ప్రజలెప్పుడూ అమాయకులు కారు. అన్ని పరిస్థితుల్నీ పరిశీలిస్తుంటారు. ఒకదాని తర్వాత ఒకటి ఆమ్‌ ఆద్మీ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ప్రజల్ని ఆలోచింపజేస్తున్నాయి. ప్రజల ఆలోచనలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే ఏ ప్రభుత్వమైనా కుప్పకూలిపోక తప్పదు.