వెంక‌య్య చెప్పిన శృంగారం క‌థ‌లు ఇవే

ఏంటి? ఎంతో బిజీగా క్ష‌ణం తీరిక కూడా లేకుండా ఉండే కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు శృంగారం గురించి మాట్లాడ‌డం ఏంట‌ని బుగ్గ‌లు నొక్కుకుంటున్నారా? అంతొద్దు! ఆయ‌న నిజంగానే శృంగారం గురించి పెద్ద ఎత్తున లెక్చ‌ర్ దంచేశారు! అయితే, అది ఏ బ‌హిరంగ స‌భ‌లోనో, ఎన్నికల ప్ర‌చార ర్యాలీలోనోకాదు. రామోజీ ఫిలింసిటీలో జ‌రిగిన ఇండీవుడ్ ఫిలిం ఫంక్ష‌న్‌లో! రామోజీ ఫిలిం సిటీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఇండీవుడ్ కార్నివాల్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈనాడు సంస్థల యజమాని రామోజీరావుకు జీవన సాఫల్య పురస్కారాన్ని అందించారు.ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా వెంక‌య్య అటెండ్ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఇండియ‌న్ మూవీల గురించి త‌న‌దైన స్టైల్‌లో మాట్లాడారు. ముఖ్యంగా సినిమాల్లో హీరో, హీరోయిన్ల గురించి ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్ యాక్ట‌ర్స్ శృంగార ర‌సం ప‌లికించ‌లేక‌పోతున్నార‌ని పేద్ద కామెంట్ చేశారు. ఆడియ‌న్స్‌ను శృంగారంలో ముంచెత్తేందుకు న‌టులు ఎంతో కృషి చేస్తున్నార‌ని అన్నవెంక‌య్య తెలుగులో త‌న‌కున్న ప్రాస‌ల ప‌ట్టును మ‌రోసారి నిరూపించారు. ఒకప్పుడు సినిమాలో హీరోహీరోయిన్లు ఒకరినొకరు కనీసం తాకకుండానే ముఖకవళికలతో ప్రేమభావాన్ని అద్భుతంగా పలికించేవారని ఇప్పుడేమో ఒకరినొకరు తాకినా – పీకినా – గోకినా కూడా శృంగార రసాన్ని పలికించలేకపోతున్నారని అన‌డంతో రామోజీరావు స‌హా కార్నివాల్‌కు వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రూ ఒక్క‌సారిగా ఘొల్లున న‌వ్వారు.

ప్రేమభావం – శృంగారం మూవీకి మెయిన్ ఆబ్జెక్ట్స్ అన్న వెంక‌య్య ఇటీవ‌ల వ‌స్తున్న మూవీల్లో ఆ రెండూ త‌క్కువ‌గానే ఉంటున్నాయ‌ని, ఆడియ‌న్స్‌ను మెప్పించ‌లేక‌పోతున్నాయ‌ని చెప్పారు.  ఇదే సమయంలో పాటలనూ ప్రస్థావించిన వెంకయ్య… నేటి పాటల్లో సంగీతం – సాహిత్యం తగ్గి వాయిద్యం ఎక్కువైందని అన్నారు. ఇక‌, భవిష్యత్తులో ఇండియన్ సినిమా ప్రపంచ సినీ పరిశ్రమకు మార్గదర్శకత్వం వహిస్తుందని ప్రపంచస్థాయికి ఎదిగే సత్తా దానికి ఉందని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా వెంక‌య్య వ్యాఖ్య‌లు అటు హాస్యం కురిపించ‌డంతోపాటు మూవీ ఇండ‌స్ట్రీకి చుర‌క‌లు కూడా అంటించాయి.