వెంక‌య్యా ఈ కుప్పి గంతులేంద‌య్యా..

`లెఫ్ట్ ఎప్పుడూ రైట్ కాదు` అని వామ‌ప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు గుప్పించాల‌న్నా ఆయ‌న త‌ర్వాతే!! `ఆకాశంలో స్కామ్‌, నీటిలో స్కామ్‌, గాలిలో స్కామ్ ఇలా వారి హ‌యాంలో అన్నింటిలోనూ స్కామ్‌లే` అని కాంగ్రెస్‌ను ఏకిపారేయాల‌న్నా ఆయ‌న త‌ర్వాతే!! ప్రాస‌లు, పంచ్‌లు.. మాట‌ల తూటాల‌తో దాడి చేస్తారు కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కావాల‌ని రాజ్య‌స‌భ‌లో పోరాడిన ఆయ‌నే ప్యాకేజీతో ఏపీకి లాభ‌మ‌ని, హోదా కంటే ఎక్కువ లాభాలు ఉంటాయ‌ని ప్లేట్ ఫిరాయించారు! విశాఖ‌కు రైల్వే జోన్ వ‌చ్చేలా కృషిచేస్తాన‌ని చెప్పిన ఆయ‌నే.. ఇప్పుడు మ‌రోసారి త‌న నైజం చూపించారు.

జూన్ 2014.. సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యవిజయం సాధించిన తర్వాత‌ బీజేపీ నేతలు విశాఖలో వెంకయ్యకు సన్మానం చేశారు. ఆ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ‘నా రాజకీయ జీవితానికి విశాఖలోనే పునాది పడింది. విశాఖను ఎప్పటికీ మరిచిపోలేను. ఇక్కడి ప్రజల డిమాండ్ రైల్వేజోన్‌తో సహా సమస్యలన్నీ పరిష్కరిస్తా’ అని వాగ్దానం చేశారు. అలా అప్పు చెప్పిన వెంక‌య్య‌.. 2016 సెప్టెంబర్‌లో విశాఖ‌కు వెళ్లారు. కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ‘ఏం తమాషాగా ఉందా.. రైల్వేజోన్‌పై ఉద్యమమేంటి.. పనీపాటా లేని వాళ్లు ఏవో చేసేస్తే సరిపోతుందా.. జోన్ విశాఖకో.. విజయవాడకో.. సుబ్బారావుకో.. అప్పారావుకో.. ఎవరికివ్వాలో ప్రకటించకుండానే ఏమిటీ రాద్ధాంతం’ అంటూ రైల్వే జోన్‌పై పోరాడుతున్న‌వారిపై అసహనం వ్యక్తం చేశారు.

విభ‌జ‌న స‌మ‌యంలో న‌ష్ట‌పోయిన‌ ఏపీకి హోదా ఇస్తామ‌ని, విశాఖ‌కు రైల్వేజోన్ ప్ర‌క‌టిస్తామ‌ని, కేంద్రంతో పోరాడైనా ఇవి ఏపీకి వ‌చ్చేలా చేస్తాన‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. కానీ రెండేళ్ల త‌ర్వాత అటు హోదాపై, ఇటు రైల్వే జోన్‌పై మాట మార్చారు. ఏపీ త‌ర‌ఫున 2014లో రాజ్య‌స‌భ‌లో పోరాడిన ఆయ‌నే.. ఇప్పుడు ఏపీని అన్నివిధాలా ముంచేశారు.

కేంద్ర కేబినెట్‌లో అత్యంత సీనియ‌ర్ నేత‌గా ఉన్న ఆయ‌న‌కు.. రైల్వేజోన్ విశాఖ‌కు ర‌ప్పించ‌లేరా అనే అభిప్రాయాలూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏపీకి హామీనిచ్చిన రైల్వేజోన్‌ను విజయవాడ, గుంటూరు మధ్యలో నెలకొల్పేందుకు కేంద్రం సిద్ధంగా ఉందట. పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చే నీరు విశాఖ పారిశ్రామిక రంగానికి అవసరం కాబట్టి.. ఆ మేరకు రైల్వేజోన్‌ను త్యాగం చేయాలని విశాఖ నేతలకు కేంద్రం సూచిస్తోందట!