వావ్‌, మోడీని పొగిడేసిన రాహుల్‌ 

ప్రధానమంత్రిగా రెండేళ్ళ పదవీ కాలంలో నరేంద్రమోడీ చేసిన ఒకే ఒక్క పని ఏంటంటే, పాకిస్తాన్‌పై సర్జికల్‌ స్ట్రైక్స్‌కి సైన్యాన్ని ముందుకు నడిపించడమేనట. మామూలుగా అయితే రాజకీయాల్లో ఉన్నాక, అధికారంలో ఉన్నవారు ఏ మంచి పని చేసినా, దాన్ని విపక్షాలు హర్షించవు. అయితే ఇది దేశ భద్రతతో కూడుకున్న విషయం. దేశ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. దాంతో నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ఎలాంటి స్టేట్‌మెంట్‌ ఇవ్వడానికి వీల్లేదు.

 ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ని సమర్థిస్తున్నాం అని చెప్పి ఊరుకుంటాయి ఇష్టం లేకపోయినాసరే విపక్షాలు. కానీ రాహుల్‌గాంధీ ఓ అడుగు ముందుకేశారు. నరేంద్రమోడీని అభినందిస్తూ, ఆయన చేపట్టింది చాలా మంచి పని అని చెప్పారాయన. దురదృష్టవశాత్తూ పాకిస్తాన్‌ విషయంలో కాంగ్రెస్‌ పదేళ్ళ పాలనలో ఇలాంటి ముందడుగు ఎప్పుడూ వేయలేదు. ముంబైపై తీవ్రవాదులు దాడి చేసినప్పుడే పాకిస్తాన్‌కి ఇలాంటి గుణపాఠం చెప్పి ఉంటే బాగుండేది.

 అయ్యేదేదో అయిపోయింది. విపక్షాల నుంచి సహకారం అందుకోవడం నరేంద్రమోడీ రాజకీయంగా సాధించిన పెద్ద విజయంగా భావించవచ్చు. కొన్ని రోజుల క్రితమే, తీవ్రవాదం పట్ల ఉదాసీన వైఖరి వ్యవహరిస్తున్నారంటూ యురీ దాడి తర్వాత కాంగ్రెసు సీనియర్‌ నాయకుడు దిగ్విజయ్‌సింగ్‌ రాజకీయ విమర్శలు చేశారు. ఇప్పుడాయన, రాహుల్‌గాంధీ వ్యాఖ్యలతో షాక్‌ తిని ఉంటారు.