బాల‌య్య కోసం బాబు వైఎస్ కాళ్లు ప‌ట్టుకున్నారా.

కాపు ఉద్య‌మ నేత‌,  మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.. సీఎం చంద్ర‌బాబుపై మ‌రింత ఫైరైపోయారు. పొలిటిక‌ల్‌గా త‌న‌కు బ‌ద్ధ శ‌త్రువైన వైఎస్ కాళ్ల‌ను చంద్ర‌బాబు ప‌ట్టుకున్నార‌ని తీవ్ర సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో రెచ్చిపోయారు. ఈ మేర‌కు తాజాగా ముద్ర‌గ‌డ సీఎంకు ఓ లేఖ రాశారు. ఈ లేఖ‌లో పెద్ద పెద్ద డైలాగుల‌తో ప‌ద్మ‌నాభం విరుచుకుప‌డ్డారు. తుని ఘ‌ట‌న పేరుతో సీఐడీ అధికారులు వైకాపా నేత భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి స‌హా ప‌లువురిని విచారిస్తుండ‌డంపై ప‌రోక్షంగా కామెంట్ల‌తో కుమ్మేశారు.

2014 ఎన్నిక ల స‌మ‌యంలో కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తానంటూ ఇచ్చిన హామీని అమ‌లు చేయాల‌ని గ‌త కొన్నాళ్లుగా ఆందోళ‌న చేస్తున్న ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.. త‌న ఉద్య‌మాన్ని మ‌రింత‌గా పెంచాల‌ని డిసైడైపోయారు. ఈ క్ర‌మంలో అటు సినీ, ఇటు పొలిటిక‌ల్ కాపు మిత్రుల‌ను క‌లుపుకొని ముందుకు సాగుతున్నారు. త్వ‌ర‌లోనే పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌య్యారంటూ ఇటీవ‌ల ముద్ర‌గ‌డ గురించి  ఓ వార్త హ‌ల్‌చ‌ల్ చేసింది.

అయితే, ఇంత‌లో ఆయ‌న సీఎంకు ఓ లేఖాస్త్రాన్ని సంధించారు. గ‌తంలోనూ సీఎం చంద్ర‌బాబుకు ప‌లు లేఖ‌లు రాసినా.. ఇప్పుడు రాసిన లేఖ వాడి వేడిగా తీవ్ర సంచ‌ల‌నం క్రియేట్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. తాజా లెట‌ర్‌లో సీఎం చంద్ర‌బాబును ముద్ర‌గ‌డ ఏకేశారు. త‌న‌వి దొంగ దీక్ష‌లు అని టీడీపీ నేత‌ల‌తో విమ‌ర్శ‌లు చేయిస్తున్న చంద్ర‌బాబు.. అధికారంలో లేన‌ప్పుడు ఢిల్లీ లో చేసిన దీక్ష‌ల సంగ‌తేంట‌ని ప్ర‌శ్నించారు.  ప్రత్యేకహోదాపై తనతో కలిసి చంద్రబాబు, లోకేష్ దీక్ష చేయాలని, అప్పుడు తనది దొంగ దీక్షో… మంచి దీక్షో తేలుతుందని స‌వాలు విసిరారు. ఈ సంద‌ర్భంగా గ‌తంలోకి దూసుకుపోయిన ముద్ర‌గ‌డ‌.. సినీన‌టుడు.. హిందూపురం ప్ర‌స్తుత ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ ఇంట్లో 2004 జూన్‌లో సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ పై కాల్పులు జ‌రిపిన ఘ‌ట‌న‌ను ముద్ర‌గ‌డ ప్ర‌స్థావించారు.

ఈ కేసు నుంచి త‌న బామ మ‌రిది(బాల‌య్య‌)ని బ‌య‌ట ప‌డేసేందుకు అప్ప‌టి సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ ఇంటికి వెళ్లి చంద్ర‌బాబు ఆయ‌న కాళ్లు ప‌ట్టుకోలేదా? అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అందుకే పోలీసు కేసు నుంచి బాల‌య్య బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డార‌ని, ఇంత‌క‌న్నా నీచం ఏముంటుంద‌ని అన్నారు. కాపు ఉద్యమం పుట్టిందే చంద్రబాబునాయుడి వల్లని, ఉద్యమానికి మూల కారకుడు ఆయనేనని ముద్రగడ వ్యాఖ్యానించారు. చంద్రబాబు దయ వల్ల తనకు సిగ్గూ, లజ్జా లేకుండా పోయాయని లేఖలో ముద్రగడ తన ఆవేదన వ్యక్తం చేశారు.

తమ జాతిని, తమ జాతికి సంఘీభావం తెలిపిన వారిని సీఐడీ అధికారులతో వేధించడం మాని, రిజర్వేషన్లు ఇచ్చే పని చూడాలని ముద్రగడ సూచించారు. త‌న‌ను ఒంటి మీద బ‌ట్ట‌లు లేకుండా పోలీసుల‌తో త‌న్నించినా.. బాధ‌ప‌డ‌న‌ని, కానీ, త‌మ కాపు జాతికి రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని ముద్ర‌గ‌డ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఓ మీడియాలో లీకైన ముద్ర‌గ‌డ లేఖ సోష‌ల్ మీడియాలో విస్తృతంగా వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్ల స్పంద‌న ఎలా ఉంటుందో చూడాలి.