టీడీపీలో కూడా వెంక‌య్య‌కు ప‌ద‌వి ఉందా

ఏంటి టైటిల్ చూసి డంగ‌య్యారా?  కేంద్రం మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నేత ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు ఎప్పుడు  క‌మ‌లాన్ని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకుని, ప‌సుపు కండువా క‌ప్పుకుని సైకిలెక్కారా? అని శూన్యంలోకి చూపులు సారించి మెద‌డుకు ప‌ని చెప్పారా? ఆన్స‌ర్ దొర‌క‌లేదా? అయితే.. ఇది చ‌ద‌వండి.. రిజ‌ల్ట్ ఉంటుంది! స్టేట్ విభ‌జ‌న త‌ర్వాత ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తార‌నే ప్ర‌చారం సాగ‌డం, ఎన్నిక‌ల హామీ నేప‌థ్యంలో అంద‌రూ హోదాపై తెగ మ‌న‌సు పెట్టుకున్నారు. ఇదే విష‌యంలో చంద్ర‌బాబు స్టేట్‌కి ఏదైనా అన్యాయం జ‌రిగితే.. స‌హించేది లేద‌ని కూడా చెప్పారు. చివ‌రాక‌రికి త‌న కొడుకే అడ్డం వ‌చ్చినా స‌హించేది లేద‌న్నారు. అయితే, ఇంత‌లో కేంద్రం మాట మార్చి.. హోదా మూటను హ‌ఠాత్తుగా అట‌కెక్కించి.. ప్యాకేజీ ప్యాకెట్‌ని చంద్ర‌బాబు చేతిలో పెట్టింది.

దీంతో స‌హ‌జంగానే హోదా వ‌స్తుంద‌ని హుషారుగా ఉన్న ఏపీ జ‌నాలు.. అగ్గిమీద గుగ్గిలంలా మండిప‌డ్డారు. దీనిని ప్ర‌తిప‌క్షాలు కూడా అందిపుచ్చుకుని చంద్ర‌బాబుపై ఎప్ప‌టినుంచో ఉన్న క‌సిని కొంత క‌లిపి కొన్ని రోజులుగా తిట్టిపోస్తున్నాయి. కానీ, అదే సంద‌ర్భంలో త‌మ‌ను తాము కాపాడుకోడానికి ఏపీ సీఎం చంద్ర‌బాబు, కేంద్ర మంత్రి వెంక‌య్య‌లు హుటాహుటిన రంగంలోకి దిగి.. హోదా వేస్ట్‌.. ప్యాకేజీ బెస్ట్‌! హోదా గోదాలోకి.. ప్యాకేజీ ఆదాలోకి! హోదా క‌న్నా.. ప్యాకేజీ మిన్న‌! హోదా వ‌ద్దు.. ప్యాకేజీ ముద్దు! అంటూ అంత్య‌ప్రాస‌ల‌తో అద‌ర‌గొట్టి ఏపీలో ప్ర‌చారం ప్రారంభించారు. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే.. ఈ ప్ర‌చారం హిట్ట‌యింద‌ని అంటున్నాయి కొన్ని ప‌త్రిక‌లు!

ఇక‌, ఈ ప్ర‌చారంపై ప్ర‌ధాన విప‌క్షం వైకాపా నేత‌లు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. హోదా కావాల‌న్న వెంక‌య్యా… ఇదేంట‌య్యా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వెంక‌య్య‌పై వైకాపా నేత భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి ఓ రేంజ్‌లో ఫైరైపోయారు. బీజేపీలో ఉండి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నా కూడా ఏపీకి వచ్చేసరికి టీడీపీకి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవాచేశారు. హోదాను స‌మ‌ర్థిస్తూ.. వెంక‌య్య చంద్ర‌బాబుకు అనుకూలంగా మాట్లాడుతున్నార‌ని అన్నారు. వెంకయ్య – చంద్రబాబు ఇద్దరూ అవిభక్త కవలలని – శరీరాలు వేరైనా వారు చెప్పే మాటలు ఆడే అబద్ధాలు ఒక్కటేనని అన్నారు.  ప్రత్యేక హోదాను సమాధి చేయడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబు – వెంకయ్యలు తెలుగు జాతి ద్రోహులుగా మిగిలిపోతారని దుయ్య‌బ‌ట్టారు. సో.. ఇప్పుడు తెలిసిందా.. టీడీపీలో వెంక‌య్య ప‌ద‌వేంటో?!