చంద్రబాబు దెబ్బకి జగన్‌ షాక్‌!

శాసనసభ సమావేశాలకు ముందు వైసిపి ఊహించని షాక్‌ ఇది. తిరుపతి మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ముఖ్య నేత కూడా అయిన భూమన కరుణాకర్‌రెడ్డిని తుని విధ్వంసం కేసులో ఆంధ్రప్రదేశ్‌ సిఐడి విచారిస్తుండడంతో పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. తొలి రోజు విచారణ ముగియగా, రెండో రోజు కూడా విచారణకు హాజరు కావాల్సిందిగా సిఐడి అధికారులు భూమనను ఆదేశించారు. అయితే తనకేమీ భయం లేదని, విచారణకు హాజరవుతానని భూమన చెప్పారు విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.

అయినప్పటికీ శాసనసభలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీకి ఇది అతి పెద్ద దెబ్బ. కాపుల రిజర్వేషన్‌ అంశం గురించి వైఎస్‌ జగన్‌ ప్రస్తావిస్తే, వెంటనే ‘మీ పార్టీకి చెందిన నేతని సిఐడి విచారించింది’ అనడంతోపాటు, ‘అతనే ఆ విధ్వంసానికి స్కెచ్‌ వేసింది’ అని కూడా ఎదురుదాడి చేయడానికి వీలుంటుంది. అంతే కాకుండా భూమన కరుణాకర్‌రెడ్డి అరెస్టు అయ్యే అవకాశాలున్నాయని కూడా టాక్‌ వినవస్తోంది.

ఇది నిజమైతే, అసెంబ్లీ సమావేశాల్లో కాపు రిజర్వేషన్‌ అంశాన్ని ప్రస్తావించేందుకు కూడా వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ సాహసించబోదేమో. జిఎస్‌టి బిల్లుకి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఆమోదం తెలపవలసి ఉంది. అందుకనే సమావేశాలు జరగనున్నాయి. వీటితోపాటు ఇంకొన్ని బిల్లులను ఆమోదించుకోవాలనుకుంటున్న ప్రభుత్వం, ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయడానికి వ్యూహాత్మకంగా భూమన కరుణాకర్‌రెడ్డిని ఇరికించిందేమోనని భావించవచ్చు.