ఏపీ మంత్రుల‌కు రెడ్డి టెన్ష‌న్

ఏపీలో చంద్ర‌బాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావడంతో మంత్రివర్గ విస్తరణపై చాలా మంది గంపెడు ఆశ‌లు పెట్టుకుని కళ్లుకాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. చంద్ర‌బాబు ద‌స‌రాకు మంత్రివ‌ర్గాన్ని విస్త‌ర‌ణ చేస్తున్న‌ట్టు లైట్‌గా సంకేతాలు ఇవ్వ‌డంతో ఆశావాహుల ఆనందానికి అవ‌ధులే లేవు అలాగే మంత్రి వ‌ర్గం నుంచి ఊస్ట్ లిస్ట్‌లో ఉన్న మంత్రుల్లో పెద్ద టెన్ష‌న్ నెల‌కొంది.

ఇదిలా ఉంటే రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఓ ఎమ్మెల్సీ దెబ్బ‌తో ఇప్పుడు బాబు కేబినెట్‌లో ఉన్న రెడ్డి మంత్రులు త‌మ ప‌ద‌వుల‌కు గండం పొంచి ఉంద‌ని లోలోన తెగ టెన్ష‌న్ ప‌డిపోతున్నార‌ట‌. ఆ రెడ్డి ఎమ్మెల్సీకి బాబు కేబినెట్‌లో బెర్త్ ఖాయ‌మ‌న్న గుస‌గుస‌లు రావ‌డంతో బాబు కేబినెట్‌లో రెడ్డి మంత్రులు ఎవ‌రి ప‌ద‌వి పోతుందో అని లెక్క‌లు వేసుకుంటున్నార‌ట‌.

ప్ర‌కాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ మాగంటి శ్రీనివాసుల‌రెడ్డికి ఇటీవ‌ల చంద్ర‌బాబు క్యాంప్ స్వ‌యంగా క‌బురు అందింది. విజ‌య‌వాడ వ‌చ్చి సీఎంను కల‌వాల‌న్న సారాంశం అది. అయితే అదే టైంలో బాబు వ‌ద్ద అదే జిల్లాకు చెందిన క‌ర‌ణం బ‌ల‌రాం, ఆయ‌న త‌న‌యుడు వెంక‌టేష్ కూడా అక్క‌డే ఉన్నారు. దీంతో మ‌రుస‌టి రోజు ఉద‌యం వ‌చ్చి త‌న‌ను క‌ల‌వాల‌ని ఆయ‌న‌కు సూచించారు.

మ‌రుస‌టి రోజు ఉద‌యమే మాగంటి చంద్ర‌బాబును క‌లిశారు. చంద్ర‌బాబు ఆయ‌న్ను పూర్తిగా పార్టీ కార్య‌క‌లాపాల‌కే టైం కేటాయిస్తారా అని అడిగిన‌ట్టు స‌మాచారం. అంతే బాబును మాగంటి క‌లిశార‌న్న వార్త అలా లీక్ అయ్యిందో లేదో ఆయ‌న‌కు కేబినెట్‌లో బెర్త్ క‌న్‌ఫార్మ్ అన్న గుస‌గుస‌లు మొద‌లైపోయాయి.

మాగుంట‌కు రెడ్డి కోటాలో బెర్త్ దాదాపు క‌న్‌ఫార్మ్ కావ‌డంతో ఇప్పుడు బాబు కేబినెట్‌లో ఉన్న రెడ్డి వ‌ర్గం మంత్రుల్లో ఒక‌రికి ఊస్టింగ్ గ్యారెంటీ అన్న టాక్ వ‌స్తోంది. ప్ర‌స్తుతం బాబు కేబినెట్లో రెడ్డి వ‌ర్గం నుంచి బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి, ప‌ల్లె ర‌ఘునాథ్‌రెడ్డి ఉన్నారు. తాజా విస్త‌ర‌ణ‌లో మ‌రో రెడ్డికి చోటు ఉంటుంద‌ని అంటున్నారు. ఇక జంపింగ్ రెడ్డి అయిన భూమా నాగిరెడ్డికి కూడా రేసులో ఉన్నారు.

విప‌క్ష నేత జ‌గ‌న్ సామాజిక‌వ‌ర్గం నుంచి మొత్తం త‌న కేబినెట్‌లో ముగ్గురు మంత్రులు ఉండడం ద్వారా ఆ సామాజిక వ‌ర్గం వారిని కూడా త‌న వైపున‌కు తిప్పుకోవాల‌న్న‌దే బాబు ప్లాన్‌. అలా జ‌రిగితే మాగుంట‌, భూమాకు రెండు బెర్త్‌లు ఇవ్వాలంటే ప్ర‌స్తుతం ఉన్న ఇద్ద‌రిలో ఒక‌రికి ప‌క్క‌న పెట్ట‌క త‌ప్ప‌దు. దీంతో బొజ్జ‌ల‌, ప‌ల్లె త‌మ‌లో ఒక‌రికి వేటు త‌ప్ప‌దేమోన‌న్న ఆందోళ‌న‌లో ఉన్నార‌ట‌. వీరి ఆందోళ‌న‌లు ఎలా ఉన్నా ప‌ల్లె మీదే వేటుక‌త్తి వేలాడుతున్న‌ట్టు ఏపీ పొలిటిక‌ల్ ఇన్న‌ర్ సైడ్ టాక్‌.