అఖిల్‌ రీ-లాంఛ్‌: నాగ్‌ ఫుల్‌ హ్యాపీ.

తొలి సినిమా ‘అఖిల్‌’ నిరాశపరిచిన విషయంపై నాగార్జున స్పష్టతనిచ్చాడు. మామూలుగా అయితే సినీ పరిశ్రమలో వైఫల్యాల్ని ఎవరూ ఒప్పుకోరు. కానీ నాగార్జున అలా కాదు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తాడాయన. అందుకే అఖిల్‌ తొలి సినిమా వైఫల్యాన్ని ఒప్పుకుంటూ, రీ-లాంఛ్‌కి అఖిల్‌ని సిద్ధం చేసినట్లు ప్రకటించాడు. ‘మనం’ వంటి పెద్ద హిట్‌ అందించిన విక్రమ్‌ కుమార్‌ చేతుల్లో అఖిల్‌ని పెడుతున్నట్లు అభిమానుల్ని ఉద్దేశించి ప్రకటించిన నాగార్జున, ఈ సినిమాతో కొత్త స్టార్‌ పరిచయమవుతున్నాడు, అతనే అఖిల్‌ అని చెప్పడం గమనించదగ్గది. రీ-లాంఛ్‌ అని నాగార్జున ప్రకటించడం వెనుక పెద్ద కథే ఉందట. కొత్త సినిమాకి సంబంధించిన అన్ని విషయాల్నీ నాగార్జున దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడని సమాచారమ్‌.

కథ ఎంపిక దగ్గర్నుంచి, నటీనటుల ఎంపిక వంటివన్నీ నాగార్జున కనుసన్నల్లోనే జరుగుతాయట. ఎందుకంటే అఖిల్‌ని హీరోగా నిలబెట్టడం నాగార్జున ప్రెస్టీజియస్‌ బాధ్యతగా భావిస్తున్నారు. ఇంకో వైపున నాగచైతన్య కెరీర్‌ని గాడిన పెట్టేందుకు కూడా నాగ్‌ పడుతున్న తపన అర్థం చేసుకోదగ్గదే. తొలి సినిమా ‘అఖిల్‌’ విషయంలో దర్శక నిర్మాతలకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన నాగార్జున, అఖిల్‌ తదుపరి సినిమాకి కూడా అదే స్వేచ్ఛనిస్తూనే, నటుడిగా, నిర్మాతగా తాను సంపాదించిన అనుభవం కొద్దీ సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళే ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారట. ఒక్కసారి సినిమా సెట్స్‌ మీదకు వెళితే, నాగ్‌ ఇక అందులో జోక్యం చేసుకోవడం ఉండదు.