మరో మల్లన్నసాగర్‌ గా తయారవుతున్న ఫార్మా సిటీ…

ఫార్మాసిటీ…. తొలుత 6000 ఎకరాల్లో ఫార్మాసీటీకి ఊపిరి పోయాలని అనుకున్నా, కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలతో  12,500 ఎకరాలకు పెంచారు. ఈ ప్రాజెక్టుకు ఎన్డీయే సర్కారు  జాతీయ పెట్టుబడి, తయారీ కేంద్రం హోదా సైతం మంజూరు చేసిందని టీఎస్‌ఐఐసీ అధికారులు అంటున్నారు.ఫార్మా సిటీ కోసం రంగారెడ్డి జిల్లా కందుకూరు, యాచారం మండలాలు, మహబూబ్‌నగర్‌ జిల్లా ఆమనగల్‌ మండలాల్లోని 19 గ్రామాల్లో ఇప్పటికే భూసేకరణకు శ్రీకారం చుట్టారు. అయితే కందుకూరు మండలం ముచ్చర్ల ప్రధాన కేంద్రంగా ఫార్మాసిటీ రూపుదిద్దుకోనుంది. దీనికోసం ప్రభుత్వం టీఎస్‌ఐఐసీ ద్వారా ప్రభుత్వ, పట్టా, అసైన్డ్‌భూముల సేకరణకు పూనుకుంది. ఇక్కడే అసలు సమస్యలు ప్రారంభమయ్యాయి. నిజానికి ఈ ప్రాజెక్టును సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

ఇప్పటికే ఫార్మా రంగంలో హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ హబ్‌గా ఉంది. దీన్ని మరింత విస్తరింపజేయడానికి, ఉపాధి అవకాశాలను విస్త్రృతం చేయాలనే భావనతో ఉన్నా, భూసేకరణ ప్రధాన అంశంగా మారింది. విలువైన నిరుపేద రైతులు, వృత్తిదారులు, ఇతరుల భూములు ఫార్మాసిటీలో పోనున్నాయి. దీనిపై స్థానికంగా ఇప్పటికే ఉద్రిక్తత నెలకొంది. స్థానిక ప్రజలు, రైతు, వ్యవసాయకార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. పరిహారం న్యాయంగా ఇవ్వకపోవడం, ఊళ్లు, చెరువులు, కుంటలు మాయమయ్యే పరిస్థితులు నెలకొనడం ఆందోళనకు కారణమైంది. గ్రామీణ జీవితం చిధ్రమయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కంపెనీల సంగతేమోగానీ మా బతుకుతెరువుకు కారణమైన భూములు పోతున్నాయంటూ స్థానికులు కన్నీళ్లపర్యం తమవుతున్నారు. ఆందోళన చెందుతున్నారు. సర్కారుపై మహిళలు శాపనార్థాలు పెడుతున్నారు. యువతకు ఉపాధిపై ఆశలు కనిపించడం లేదు. పక్కనే ఉన్న మహేశ్వరంలో ఇప్పటికే ఏర్పాటైన పలు రకాల పరిశ్రమల్లో స్థానికులకు ఆశించిన మేర ఉపాధి దొరకకపోవడమే కారణమని చెబుతున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే లైన్లు, ఇతర రవాణా సౌకర్యాలు ముచ్చర్లకు సమీపంలో ఉండటంతో, ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తే ప్రాజెక్టు సక్సెస్‌ అవుతుందనే భావనలో ప్రభుత్వం ఉంది.

ప్రస్తుతం ఫార్మాసిటీ పనులు ఊపందుకుంటున్నాయి. భూసేకరణ కార్యక్రమం చురుగ్గా సాగుతున్నది. ఫార్మాసిటీని ఏర్పాటు చేయడానికి జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు సైతం ముందుకొస్తున్నాయి. దరఖాస్తులు సైతం ఇప్పటికే సమర్పించాయి. అందులో భూములు కేటాయించాలంటూ ఇప్పటికే కోరాయి. సేకరించిన భూముల చుట్టూ టీఎస్‌ ఐఐసీ అధికారులు ఇనుపకంచె(ఫెన్సింగ్‌) ఏర్పాటు చేసే పనులు ప్రారంభించింది. ముచ్చర్ల, సాయిరెడ్డిగూడ, జమ్మలభావీతండా, కుర్మిద్ద, నానక్‌నగర్‌, దేవరకంచె, పొట్ల పల్లి, పంజాగూడ, ఆకులమైలారం, ఊట్లపల్లి, మీర్‌ఖాన్‌పేట తదితర ప్రాంతాల్లో దాదాపుగా ఈ పని పూర్తయింది. ఇంకా భూసేకరణ కార్యక్రమం కొనసాగు తున్నది. ప్రస్తుతం పట్టా భూములు, అసైన్డ్‌భూములను సేకరిస్తున్నారు. కొందరికి పరిహారం ఇచ్చారు. మరికొందరికి ఇవ్వలేదు. దీంతో స్థానికంగా అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఆందోళన సైతం కనిపిస్తున్నది.

భూసేకరణలో భాగంగా జమ్మలభావీ తండా ను ఎత్తేసే అవకాశాలు ఉన్నాయి. ఇది మహబూబ్‌నగర్‌ జిల్లా ఆమన్‌గల్‌ మండల పరిధిలోకి వస్తున్నది. ఈ తండాలో దాదాపు 40 కుటుంబాలు నివసిస్తున్నాయి. తమ తండాను ఖాళీ చేయిస్తారనే సంగతి ఇప్పటికీ స్థానికులకు తెలియకపోవడం గమనార్హం. అలాగే సాయిరెడ్డిగూడ గ్రామంలో సగం ఊరు భూసేకరణలో భాగంగా పోనుందని సమాచారం.కాగా చైనా ఫార్మాసిటీ తరహాలో ముచ్చర్ల ప్రాజెక్టును చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. ఫార్మాసీటీలో ఆయా కంపెనీలు, పరిశ్రమలు స్థాపించేందుకు అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తిని చూపుతున్నాయి. ప్రధానంగా జర్మనీ, ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌, కెనడాతోపాటు మరో 12 కంపెనీలు ఉన్నాయని తెలిసింది. అమెరికాకు చెందిన ఆరు కంపెనీలు సైతం ఇప్పటికే దరఖాస్తు చేశాయని టీఎస్‌ఐఐసీ అధికారులు అంటున్నారు. అలాగే జాతీయ కంపెనీలు సైతం 10 ఉన్నాయని సమాచారం. నీరు, రోడ్లు, విద్యుత్‌ అందజేయనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మాసిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.