పుష్కరం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకం

పన్నెండేళ్ళకు వచ్చే పుష్కరాలు ఎంతో ప్రత్యేకమైనవి. అలా ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల గోదావరి పుష్కరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ తొలి పుష్కరాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఏడాది తిరిగింది, ఈసారి కృష్ణా పుష్కరాలొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చేశాయి.

ఈ నెల 12వ తేదీ నుంచి పుష్కరాలు జరగనుండగా, ముందే పుష్కర వైభవం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా ప్రత్యేకం ఈ కృష్ణా పుష్కరాలు. ఎందుకంటే, పుష్కరాలు జరిగే ప్రధానమైన రెండు జిల్లాల పరిధిలో కొత్త రాజధాని అమరావతి నిర్మితమవుతోంది. పుష్కర కేంద్రంగా అమరావతి వర్ధిల్లనుంది. దాంతో, అమరావతి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు పుష్కరాలను వేదికగా చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు, కర్నూలు జిల్లాలోనూ పుష్కరాలు అంగరంగ వైభవంగా జరిపేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది.

ప్రధానంగా పుష్కరాల పనులతో అమరావతికి కొత్త కళ వచ్చిందని చెప్పవచ్చు. ఇంకో వైపున విజయవాడలో పుష్కర పనులు శాశ్వతంగా కృష్ణా నదీ తీరం పర్యాటక ప్రాంతమయ్యేలా చేపట్టడంతో, సందర్శకులు, పర్యాటకుల తాకిడి రోజురోజుకీ పెరుగుతోంది. హైదరాబాద్‌కి ట్యాంక్‌బండ్‌లా, విజయవాడలో కృష్ణా తీరం పుష్కరాల పనులతో వెలుగులుజిమ్ముతోంది.