పవన్‌కళ్యాణ్‌కి శక్తి సరిపోదా?

పవన్‌కళ్యాణ్‌ ఎంత మాట అనేశాడు? ఎన్నికలకు ముందే పవన్‌కళ్యాణ్‌ ఈ మాట అని ఉంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు, ఈ రోజు పవన్‌కళ్యాణ్‌ని ప్రశ్నించేవారే కాదు. నన్ను నమ్మి భారతీయ జనతా పార్టీనీ, తెలుగుదేశం పార్టీనీ గెలిపించండి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఈ ఇద్దరూ నెరవేర్చకపోతే మీతోపాటు ఉండి నేనూ వారిని ప్రశ్నిస్తానని చెప్పిన పవన్‌కళ్యాణ్‌, ఇప్పుడు ప్రశ్నించడానికి తన శక్తి చాలదనడం శోచనీయం. రాజకీయాల్లో అపరిపక్వతకి పరాకాష్ట ఇది అని పవన్‌కళ్యాణ్‌ని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారంటే, దానికి కారణం ఆయనే. వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు రోజా అయితే, పవన్‌కళ్యాణ్‌ గబ్బర్‌సింగ్‌ కాదు, రబ్బర్‌సింగ్‌ అని విమర్శించేశారు.

పవన్‌కళ్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ప్రత్యేక హోదా ఉద్యమంలో వైఎస్‌ జగన్‌కి మద్దతు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు రోజా. ఇదివరకు ఓ సందర్భంలో పవన్‌కళ్యాణ్‌ని రాజకీయాలపై ప్రశ్నించినప్పుడు, ‘ఎన్నికల్లో పోటీ చేయడానికి, పార్టీ నడపడానికి తగినంత ఆర్థిక స్తోమత నాకు లేదు’ అన్నారు. ఇప్పుడేమో శక్తి సరిపోదంటున్నారు. జనసేన పార్టీని స్థాపించిన పవన్‌కళ్యాణ్‌, సినీ పరిశ్రమలో తిరుగులేని స్టార్‌. అలాంటి వ్యక్తి ప్రజల్లోకి వెళితే, ఆయన చిత్తశుద్ధితో పనిచేస్తే, ప్రజా శక్తి ఆయనకు అండగా నిలుస్తుంది. ప్రత్యేక హోదా పార్లమెంటు ఇచ్చిన హక్కు అని చెబుతున్న పవన్‌కళ్యాణే, దాన్ని సాధించడంలో చిత్తశుద్ధి చూపకపోవడం ఆశ్చర్యకరం.