కొత్త జిల్లాలు దసరాకే పక్కా

తెలంగాణలో కొత్త జిల్లాలు దసరా నుంచి ఉనికిని చాటుకుంటాయని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకటించారు. దసరా నాటికి కొత్త జిల్లాల ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలంటూ అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన కెసియార్‌, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సాక్షిగా కొత్త జిల్లాల ఉనికి దసరా నుంచి జరుగుతుందని ప్రకటించడం ఆయనలోని ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా చెప్పవచ్చు.

ఎందుకంటే, కొత్త జిల్లాల పట్ల కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాల్నీ తీసుకోవాలని తెలంగాణలోని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అప్రజాస్వామికంగా, అనైతికంగా జిల్లాల విభజనకు ప్రభుత్వం సంసిద్ధమవుతోందనే ఆరోపణలు కాంగ్రెసు, టిడిపిల నుంచి వస్తున్నాయి. రాజకీయంగా ప్రత్యర్థుల్ని దెబ్బకొట్టేందుకు అడ్డదిడ్డంగా జిల్లాల్ని విభజించడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని ఆ పార్టీల వాదన.

అయితే అన్ని వర్గాల అభ్యంతరాల్నీ పరిశీలిస్తామని ముఖ్యమంత్రి కెసియార్‌ చెబుతున్నారు. అయితే కెసియార్‌ చెబుతున్న మాటల్ని తెలంగాణలోని ఏ ఇతర రాజకీయ పార్టీ కూడా విశ్వసించడంలేదు. తమ అభ్యంతరాల్ని పట్టించుకోకుండా ‘అందరి సూచనల్ని స్వీకరిస్తాం’ అనడం ఎంతవరకు సబబు అని కాంగ్రెసు, టిడిపి నాయకులు ప్రశ్నిస్తున్నారు.