కెసియార్‌ టీడీపీని ఇలా కూడా దెబ్బకొడుతున్నారా?

గ్యాంగ్‌స్టర్‌ నయీం బతికొచ్చి ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పలేడు. పోలీసులు ఏం చెబితే అదే నిజం అనుకోవాలి. ప్రభుత్వం ఎలా చెబితే పోలీసులు అలా నివేదిక ఇస్తారు. ఇదీ విపక్షాల ఆరోపణ. గ్యాంగ్‌స్టర్‌ నయీం ఎన్‌కౌంటర్‌ జరిగిన తరువాత పోలీసు, రాజకీయ వర్గాల్లో సునామీ మొదలైంది. ఈ సునామీలో ఎవరు కొట్టుకుపోతారో తెలియడంలేదు.

పోలీసులు సేఫ్‌ అవ్వాలంటే అధికార పార్టీ చెప్పినట్లు పోలీసులు వ్యవహరించాలని హుకూం జారీ అయినట్లుగా పరిస్తుతులు కానవస్తున్నాయంటూ రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతున్నది. లేదంటే నయీం ఎపిసోడ్‌లో తెలుగుదేశం పార్టీ నేత ఉమా మాధవరెడ్డి పేరు తెరపైకి రావడమేంటి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోయి పన్నెండేళ్ళకుపైనే అవుతోంది. తెలుగుదేశం పార్టీ తరువాత కాంగ్రెసు పార్టీ 10 ఏల్ళు అధికారంలో కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర సమితి రెండేళ్ళుగా అధికారంలో ఉంది.

నయీం లాంటి గ్యాంగ్‌స్టర్లు అధికారంలో ఉన్నవారితోనే సఖ్యతగా ఉంటారు, వారి పనులు నెరవేర్చుకోవడం కోసం. కానీ టిఆర్‌ఎస్‌ నేతలు కొందరు, చంద్రబాబే నయీంని పెంచి పోషించారని చెప్పడం వింతగా ఉంది. చంద్రబాబు హయాంలో రౌడీ షీటర్లు, గ్యాంగ్‌స్టర్లే కాదు, నక్సలైట్లు కూడా బెంబేలెత్తారు. ఇలాంటివారిని పార్టీలకు అతీతంగా చూడాలి. అంతే తప్ప దీన్ని రాజకీయం చేయడం తగదు. కెసియార్‌, ఈ ఘటనని కూడా రాజకీయంగా వాడుతున్నారనే విమర్శలకు ప్రభుత్వం తావివ్వకుండా పారదర్శకంగా విచారణ జరిపించవలసి ఉంటుంది.