చంద్రబాబు దెబ్బకి వణుకుతున్నారు 

పార్టీలో పనిచేస్తున్న నాయకులెవరు? పనిచెయ్యని నాయకులెవరు? అని తెలుసుకోడానికి చంద్రబాబు సర్వే నిర్వహించారు. ఆ సర్వే ఫలితాల్లో ఎక్కువమంది నాయకులు పనిచేయనివారే ఉన్నారని తేలింది. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నాం, ప్రజలకు దగ్గర పోలేకపోతున్నాం చంద్రబాబు ఆ నాయకులపై అసహనం కూడా వ్యక్తం చేశారని సమాచారమ్‌. అయితే నివేదిక వివరాల్ని బయటపెట్టడంలేదని చెప్పడం కొంత ఊరట.

విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత పనిచేయని ఎమ్మెల్యేలు, ఇతర నాయకులకు ‘శిక్షణ’ ఇచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారట. ఈ శిక్షణా శిబిరాలకు హాజరు కావాల్సిందిగా చంద్రబాబు స్వయానా ఆ నాయకులకు లేఖలు రాయనున్నట్లు తెలియవస్తోంది. ఈ లేఖలు ఎవరికి రాస్తారో ఇంతవరకు ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. రాకుండా తెలుగుదేశం పార్టీ జాగ్రత్తలు తీసుకుంది.

అయితే శిక్షణ ప్రారంభమయిన తరువాత ఆ శిక్షణకు హాజరైన నాయకులందరికీ నివేదికలో మైనస్‌ మార్కులు వచ్చాయని అనుకోవాల్సి ఉంటుంది కదా. అందుకనే అలాంటివేవీ చేయకుండా అందరికీ కలిపి శిక్షణ ఇప్పించాల్సిందిగా చంద్రబాబుని పార్టీ నాయకులు కోరనున్నట్లు తెలియవస్తోంది. ముందుగా లోకేష్‌ వద్దకు ఈ పంచాయితీ వెళ్ళిందట. నియోజకవర్గాల్లో తమ పరువు పోతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నవారు నివేదిక బయటపెట్టవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. చంద్రబాబు దెబ్బకి భలేగా వణుకుతున్నారు ఆ ఎమ్మెల్యేలంతా.