కార్నర్‌ అయ్యింది హరీష్‌రావే

మల్లన్నసాగర్‌ వ్యతిరేక ఉద్యమంలో మంత్రి హరీష్‌రావు కార్నర్‌ అయ్యారు. ఈ వివాదంలో స్వయంగా ముఖ్యమంత్రి కెసియార్‌ జోక్యం చేసుకోవలసి ఉన్నప్పటికీ ఆయన ఆ పని చేయలేదు. ప్రాజెక్టు నిర్వాసితులతో హరీష్‌రావు ఓ దఫా చర్చలు జరిపి వివాదాన్ని కొంత కొలిక్కి తెచ్చారు. ఇక్కడే టిఆర్‌ఎస్‌ నాయకులంతా హరీష్‌రావుకి సహకరించితే వివాదం ఇంతగా ముదిరేది కాదు.

హరీష్‌ని ఒంటరి చేయడం ద్వారా ప్రాజెక్టు నిర్వాసితుల ఉద్యమం ఉధృతమయి ఇందులో ఆయనే ఇరుక్కునేలా మారింది. టిఆర్‌ఎస్‌ మినహా అన్ని రాజకీయ పార్టీలూ మల్లన్నసాగర్‌ నిర్వాసుతులకు అండగా నిలిచారు. ప్రజా సంఘాలు కూడా కెసియార్‌ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించడంలో కెసియార్‌ వ్యూహమేమిటో ఎవరికీ అర్థం కావడంలేదు. సంబంధిత శాఖకు మంత్రిగా హరీష్‌రావు వ్యవహరిస్తున్నందున ఈ వివాదం ఆయన వైఫల్యంతోనే ముదిరిందనే సంకేతాలు జనంలోకి అలాగే రాజకీయ వర్గాల్లోకీ వెళ్ళిపోయాయి.

నేడు మెదక్‌ జిల్లా బంద్‌ జరగ్గా, అది విఫలమైందని హరీష్‌రావు తొందరతనంతో కూడిన ప్రకటన చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా ఆందోళనలకు దిగి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తున్నప్పుడు అలాంటి ఉద్యమంలో రాజకీయ పార్టీలు పాల్గొనడం మామూలే. అలాంటి ఆందోళనలు విఫలమయ్యాయనడమూ హరీష్‌రావు తొందరపాటే. ఉద్యమ పార్టీ అయిన టిఆర్‌ఎస్‌ నుంచి ఇలాంటి తొందరపాటుతో కూడిన ప్రకటనలు హాస్యాస్పదం. ఇంత జరుగుతున్నా హరీష్‌రావుని రక్షించే ప్రయత్నాలు టిఆర్‌ఎస్‌ నుంచి జరగకపోతుండడం శోచనీయం.