వాయిదా పడ్డ అమరావతి ప్లాట్ల కేటాయింపు

ఏపీ రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపుకు ప్రభుత్వం సోమవారం ముహూర్తం పెట్టింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్లాట్ల కేటాయింపు తాత్కాలికంగా వాయిదా వేశారు. దీంతో రైతులు కొంత నిరాశకు గురయ్యారు. అమరావతి నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పొలాలను త్యాగం చేసిన రైతులకు నేడు ప్లాట్లు కేటాయిస్తామని, డ్రా ద్వారా ఎవరికి ఎక్కడ ప్లాట్ ఇస్తున్నదీ ప్రకటిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే, తుళ్లూరు ప్రాంతంలో నిన్న సాయంత్రం నుంచి భారీ వర్షం పడుతూ ఉండటంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు మంత్రి నారాయణ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు.  వాతావరణం సహకరిస్తే 23న సీఎం చంద్రబాబు చేతులమీదుగా ప్లాట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కాగా గత కొన్ని రోజులుగా వాతావరణంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలో భారీగా వర్షాలుకురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులకు ఈ వర్షం ఆటంకం ఏర్పడింది.

ఇంతకుముందు, రాజధాని కోసం 29 గ్రామాల్లోని రైతులు సుమారు 33 వేల ఎక‌రాల భూమిని ప్రభుత్వానికి అప్పగించారు.భూస‌మీక‌ర‌ణ స‌మ‌యంలో రాజధాని రైతులకు ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించింది. అందులో భాగంగానే మెట్ట, జ‌రీబు రైతుల‌కు నివాస‌,వాణిజ్య స్థలాల్లో వేర్వేరుగా ప్లాట్ల కేటాయించనున్నారు. ప్లాట్ల కేటాయింపు కోసం సీఆర్డీఏ అధికారులు పెద్దఎత్తున కసరత్తు చేశారు. గత మార్చిలోనే ప్లాట్ల కేటాయింపు చేస్తామ‌ని మొదట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ తరువాత ఏప్రిల్, మే అంటూ వాయిదావేస్తూ వచ్చింది. రైతుల నుంచి ప్లాట్ల కేటాయింపు పై అభిప్రాయాలు, స‌ల‌హాలు, అభ్యంత‌రాలు స్వీక‌రించింది. రైతులు కోరుకున్న విధంగానే వారి గ్రామాల సమీపంలోనే ప్లాట్లను కేటాయించబోతోంది. భూస‌మీక‌ర‌ణ ప‌థ‌కంలో పేర్కొన్న ప్రకారమే లాట‌రీ విధానంలో ప్లాట్లు కేటాయించనున్నారు.