మల్లన్నపై కేసీఆర్‌ మొండి వైఖరి ఎందుకట!!

మల్లన్న సాగర్‌ రోజురోజుకీ వివాదాస్పదమవుతోంది. తెలంగాణ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్‌ కారణంగా పెద్ద ప్రమాదమే పొంచి ఉన్నట్లు కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న వేళ, ఇప్పటికీ ఈ వివాదంపై కెసియార్‌ సర్కార్‌ స్పందన ఏమాత్రం సబబుగా లేదు. ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోమని బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తుంటే, వారి డిమాండ్లపై సానుకూలంగా స్పందించాల్సింది పోయి, తామే పెద్ద నిర్వాసితులమని తన తల్లిదండ్రులకు ఆ బాధ ఏంటో తెలుసని మంత్రి కెటియార్‌ చెప్పడం శోచనీయం. కెసియార్‌ ప్రాజెక్టు నిర్వాసితుడో కాదో ఎవరికి ఎరుక? అది ఎవరికి అవసరం.

సమస్య ఇక్కడ నిర్వాసితుల దయనీయ స్థితి గురించి. ఇందులో విపక్షాల రాద్ధాంతమేమీ లేదు, నిర్వాసితులకు అండగా ఉండటం తప్పించి. ప్రభుత్వం మెరుగైన ప్యాకేజీ ఇస్తే ఆ నిర్వాసితులంతా ప్రభుత్వం వైపే ఉంటారు కదా. ఎన్నికల్లో ప్రజల ఓట్లు గెలిచినట్లు, నిర్వాసితుల మనసుల్ని గెలవాల్సిన బాద్యత కెసియార్‌ సర్కార్‌ మీదనే ఉంది. మల్లన్నసాగర్‌ విషయంలో నిజనిర్ధారణ కమిటీ వేయడమో, బాధితుల్ని ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవడమో చేస్తే విపక్షాలకు అవకాశమే ఉండదు. కానీ కెసియార్‌ సర్కార్‌ అలా ఆలోచించడంలేదు. బేషజాలకే పోతున్నది. తద్వారా వివాదాన్ని పెంచి పోషించడమే. కెసియార్‌ ఎందుకిలా చేస్తున్నారు? తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత మొదలైతే అది చిలికి చిలికి గాలివానలా మారి, ప్రభుత్వానికి ఎసరుపెట్టవచ్చు.