భాగ్యనగరం మైనస్‌ బెగ్గర్స్‌ 

భాగ్యనగరం హైదరాబాద్‌ని విశ్వనగరంగా మార్చేందుకోసం గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ వడివడిగా అడుగులు వేస్తోంది. ఎక్కడా బిచ్చగాళ్ళు లేకుండా హైదరాబాద్‌ని తీర్చిదిద్దేందుకు ప్రాణాళికలు రచించుకున్న జిహెచ్‌ఎంసి ఇప్పటికే యాచకులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ‘బిచ్చం వెయ్యొద్దు’ అంటూ పౌరులకు అవగాహన కల్పిస్తోంది. యాచకుల్ని సంరక్షణ కేంద్రాలకు తరలించి, వారి బాగోగుల్ని చూడటంతోపాటుగా పౌరులకు అవగాహన కల్పించడం ఇక్కడ చాలా ముఖ్యం.

అలాగే, మాఫియా ముఠాలు యాచకుల్ని పావులుగా వాడుకోవడంపైనా దృష్టిపెట్టవలసి వస్తుంది. నగరం మొత్తం మీద ఉన్న యాచకుల్లో 90 శాతం మాఫియా కనుసన్నల్లో పనిచేస్తున్నట్లుగా ఇప్పటికే అధికారులు గుర్తించారు. అలాంటి బెగ్గర్స్‌ మాఫియాపై ఉక్కుపాదం మోపితే తప్ప, భాగ్యనగరంలో యాచకుల్ని తగ్గించడానికి సాధ్యపడదు. ఎప్పటినుంచో యాచకుల్లేని నగరంగా హైదరాబాద్‌ని తీర్చిదిద్దాలనే ప్రయత్నం జరుగుతున్నా అది ఇప్పటివరకూ సాధ్యపడలేదు. ఇదివరకటిలా కాకుండా ఇకపై రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేసుకుని హైదరాబాద్‌ని బెగ్గర్స్‌ ఫ్రీ సిటీగా మార్చుతామని అధికారులు అంటున్నారు. విధిలేని పరిస్థితుల్లో యాచకులుగా మారుతున్నవారి పట్ల సమాజం నుంచి కొంత జాలి వ్యక్తమవుతుంది. కానీ అది మాఫియా బారిన పడుతుండడాన్ని సమర్థించలేము కదా.