డిప్యూటీ సీఎం రేసులో నారా లోకేష్‌ !

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి వర్గంలోకి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేరతారని వినవస్తున్న ఊహాగానాలకు సంబంధించి లేటెస్ట్‌ డెవలప్‌మెంట్‌ ఏమిటంటే, ఏదో ఒక మంత్రి పదవి కాకుండా డిప్యూటీ సీఎం పదవిని తన కుమారుడికి కట్టబెడితే ఎలా ఉంటుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. అయితే తన కుమారుడ్ని మంత్రి వర్గంలోకి తీసుకోవడంపై చంద్రబాబు ఇప్పటివరకు ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. ఏప్రియల్‌ లేదా మే నెలల్లో చంద్రబాబు మంత్రి వర్గ విస్తరణ చేపట్టవచ్చునని టిడిపి వర్గాలు భావించాయి. అయితే చంద్రబాబు, లోకేష్‌ కోసమే మంత్రి వర్గ విస్తరణను వాయిదా వేస్తూ వస్తున్నారట. ఇదివరకటిలా లోకేష్‌ని మంత్రి వర్గంలోకి తీసుకోవాలనే డిమాండ్లు పార్టీ నాయకుల నుంచి రాకపోవడం చంద్రబాబుని ఆశ్చర్యపరిచిందని సమాచారమ్‌. ఆ కారణంగానే పార్టీ ఫిరాయించిన వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇచ్చేందుకోసం కూడా మంత్రి వర్గ విస్తరణను చంద్రబాబు చేపట్టడంలేదట. అయితే ఇది ఓ సాకుగా చూపి, మంత్రి వర్గ విస్తరణను ఆలస్యం చేయడం పట్ల పార్టీ ఫిరాయించిన వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారట. జలీల్‌ఖాన్‌, జ్యోతుల నెహ్రూ, భూమా నాగిరెడ్డి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. వీరిలో ఇద్దరికి చంద్రబాబు మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇచ్చారని తెలియవస్తోంది. ముగ్గురిలో ఆ ఇద్దరూ ఎవరో తెలియదు, మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందో అసలే తెలియదు. నారా లోకేష్‌కి మంత్రి పదవి సంగతీ అంతే. డిప్యూటీ సీఎం పదవిపై స్పష్టత వస్తే వెంటనే చంద్రబాబు మంత్రి వర్గ విస్తరణ చేపడతారట.