పాలేరులో జ‌గ‌న్ మ‌నిషి పొంగులేటికి టీడీపీ వాళ్లు ఓటేస్తారా..!

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్నా ఆ పార్టీ క్యాడర్.. ఆ పార్టీ వీరాభిమానుల ఓటింగ్ ఎటువైపు ? మళ్లుతుంది అన్నది ప్రధానంగా చర్చకు వస్తోంది. తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా ఉన్న అభిమానులు కచ్చితంగా ఇక్కడ గెలుపు ఓటములను నిర్దేశించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎలా ఉన్నా గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డితో పాటు ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఆంధ్రతో సరిహద్దులు ఉన్న అన్ని నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు కచ్చితంగా ఆయా నియోజకవర్గాల్లో ప్ర‌ధాన‌ పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములను తారుమారు చేస్తుంది అనటంలో సందేహం లేదు.

ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ కూడాచాలా చోట్ల బలంగా ఉంది. గత ఎన్నికలలో పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఓడిపోయిన సత్తుపల్లి, అశ్వరావుపేట నియోజకవర్గాల్లో విజ‌యం సాధించడంతో పాటు ఆ పార్టీ పోటీ చేసిన ఖమ్మంలో అప్ప‌టి టీడీపీ క్యాండెట్‌ నామా నాగేశ్వరరావు గట్టి పోటీ ఇచ్చారు. అయితే ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా ఆత్మ గౌరవానికి ప్రాధాన్యత ఇస్తూ ఓట్లు వేసేందుకు రెడీ అవుతోంది. అటు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పార్టీలకు అతీతంగా స్పందించిన నేతలతో పాటు.. తమ పార్టీ అధినేతకు మద్దతు ప్రకటించిన వారికి మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసేందుకు ఇప్పటికే మానసికంగా సిద్ధమయ్యారు.

ఇప్పుడు ఇదంతా ఎందుకు చర్చికి వస్తుంది అంటే పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నియోజకవర్గంలో భారీగా ఉన్న తెలుగుదేశం అభిమాన‌ ఓటర్లు ఏ మాత్రం సహకరించే పరిస్థితి లేదు. అసలు పొంగులేటి పేరు చెబితేనే వారంతా మండిపడుతున్నారు. పొంగులేటి సంపాదన అంతా ఆంధ్రాలో కాంట్రాక్టులు చేసి సంపాదించుకున్నదే. పొంగులేటి ఇప్పటికీ జగన్ మనిషి… జగన్ నీడ అన్న భావన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న తెలుగుదేశం అభిమానులు అందరిలోనూ బలంగా నాటుకు పోయింది. చంద్రబాబును అరెస్టు చేసి అన్ని రోజులు జైల్లో పెడితే కనీసం పొంగులేటి మాటమాత్రంగా ఆయన చిన్న ఖండన కూడా ఇవ్వలేదు.. చిన్న ప్రకటన కూడా చేయలేదు.

పైగా పొంగులేటి వెంట ఉన్న కొందరు తెలుగుదేశం / చంద్ర‌బాబు అభిమానులు చంద్రబాబుకు బెయిలు వచ్చిన నేపథ్యంలో ర్యాలీ చేద్దాం అంటే అలాంటిదేం అవసరం లేదు అని చెప్పడంతో వాళ్లంతా అవాక్కయ్యారట. దీనిని బట్టి పొంగులేటి ఇప్పటికీ జగన్ మనిషి అని.. ఆయన పేరుకు మాత్రమే కాంగ్రెస్‌లో ఉన్నారు… తన అవసరాలకు తగినట్టుగా పార్టీలు మారుతూ ఉంటారే తప్ప ఆయన నిలకడలేమి మనస్తత్వం అందరికీ తెలిసి వస్తోంది. ఇదే ఇప్పుడు పాలేరులో పొంగులేటికి చాప కింద నీరులా వ్యతిరేకంగా మారుతుంది. అదే టైంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళ‌ ఉపేందర్ రెడ్డికి బాగా క‌లిసొస్తోంది. ఉపేందర్ రెడ్డి స్వతహాగాని నెమ్మదైన మనస్తత్వం కలిగిన వ్యక్తి.. దీనికి తోడు చంద్రబాబును అరెస్టు చేసిన వెంటనే తీవ్రంగా ఖండించిన కందాల ఆయనకు బెయిల్ వచ్చిన వెంటనే పాలేరు నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం అభిమానులు భారీ ర్యాలీ చేస్తే ఆ ర్యాలీకి బిఆర్ఎస్ శ్రేణులు వెళ్లినా పూర్తిగా సహకరించారు.

తెలుగుదేశం, చంద్ర‌బాబు అభిమానులు ర్యాలీ చేసినా స‌హ‌క‌రించిన కందాళ‌… చంద్ర‌బాబు అరెస్టు, జైలులో పెట్టిన తీరును రెండు మూడు సార్లు ఖండించారు. పై ప‌రిణామాలు అన్నీ కూడా నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా ఉన్న తెలుగుదేశం అభిమానుల్లో మంట పెట్టేస్తున్నాయి. తాము ఆత్మాభిమానం చంపుకుని పొంగులేటికి అస్స‌లు ఓటేయ‌లేమ‌ని… కందాళ వైపే ఉంటామ‌ని చెపుతున్నారు. ఇప్ప‌టికే సీపీఎం ఓట్లు చీల‌తాయ‌న్న టెన్ష‌న్‌తో ఉన్న పొంగులేటికి ఇప్పుడు టీడీపీ ఓట్లు కూడా దూర‌మైతే గెలుపున‌కు మ‌రింత దూర‌మైపోతోన్న వాతావ‌ర‌ణ‌మే క‌నిపిస్తోంది.