టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఇటీవల నేషనల్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. పుష్ప సినిమాకు ఉత్తమ నటుడుగా ఆయనకు అవార్డు వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ రావడంపై ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ” జీవితంలోని ప్రతి దశలో నేను ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటా. ఏదైనా గట్టిగా కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుందని.. సాధారణంగా మనం అనుకుంటాం.
జాతీయ అవార్డు అందుకున్న తరువాత నాకు తెలిసిన విషయం ఏమిటంటే.. మనతోపాటు మన చుట్టూ ఉన్న వాళ్లు కూడా కోరుకుంటేనే ఏదైనా సరే జరుగుతుంది. జాతీయ అవార్డు అందుకోవాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. కానీ నాకు అవార్డు రావాలని సుకుమార్ మరింతగానో కోరుకున్నారు. అందుకే నాకు ఈ అవార్డు వచ్చింది. ఆయనే అచీవర్.. నేను కేవలం అచీవ్మెంట్ మాత్రమే ” అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.
అలాగే దేవిశ్రీప్రసాద్ గురించి మాట్లాడుతూ.. దాదాపు 20 ఏళ్లలో బాలీవుడ్కు వెళ్ళమని ఎన్నిసార్లు చెప్పాను లెక్కలేదు. నేను ఆ మాట చెప్పిన ప్రతిసారీ.. ముందు నువ్వు వెళ్ళు నీతో పాటు నేను వస్తా అనేవాడు. అతడి మాటలు విన్నాక మనకెక్కడ సాధ్యమవుతుందిలే అనుకునేవాడని. అలాంటిది మేమిద్దరం ఒకేసారి పుష్ప తో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాం. తెలుగు, హిందీలో మంచి విజయాన్ని అందుకున్నామని తెలిపారు. ప్రస్తుతం అల్లు అర్జున్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.