శ్రావణ శుక్రవారం స్పెషాలిటీ ఏంటి… వ్ర‌తం ఎందుకు చేస్తారో తెలుసా..!

మహిళలు శ్రావణ శుక్రవారం సమయంలో చాలా నిష్టగా పూజలు చేస్తూ ఉంటారు. తమ పసుపు, కుంకములు క్షేమం కోసం పూజలు చేస్తారు. ఈ సమయంలోనే వర్షాలు అధికంగా కురుస్తాయి. వాగులు, వంకలు , సముద్రాలు, చెరువులు పొంగిపొర్లుతాయి. తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 17వ తేదీ నుంచి శ్రావణమాసం మొదలయింది. ఈ శ్రావణ మాసం సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఉంటుంది.

ఈ నెలలో సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాల పూజలు, నోములు, ఇళ్లల్లోకి వెళ్లడాలు, వ్రతాలతో ఈ నెలరోజుల పాటు అధికంగా నెలకొని ఉంటాయి. ఈ నెలలో శ్రావణ మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తారు. ఈ కాలంలో చంద్రుని నుంచి కలిగే అశుభ ఫలితాలు నుంచి తప్పించుకునేందుకు, మానసిక శాంతిని కాపాడుకునేందుకు శ్రావణ మాసంలో అనేక పూజలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఇంట్లోనే ముత్తయిదువులను ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేస్తారు.

ఈ శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మిని పూజించడం ద్వారా ధనం, ఆరోగ్యం లభిస్తుందని తెలుగింటి ఆడ‌ప‌డుచుల న‌మ్మ‌కం. శ్రావణ సోమవారాలు మహాలక్ష్మి నీ పూజిస్తే సౌభాగ్యవ‌తిగా ఉంటారని పెద్దవాళ్లు అంటారు. ముఖ్యంగా శ్రావణ రెండో శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుతారు. అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారి ప్రతిరూపంగా భావించి భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో అమ్మ‌వారికి పూజ‌లు చేస్తారు.