సత్తెనపల్లిలో కన్నా-కోడెలతో లోకేష్..సెట్ అయినట్లేనా?

సత్తెనపల్లిలో తెలుగు తమ్ముళ్ళ మధ్య వివాదం సద్దుమణిగినట్లేనా? లోకేష్ ఎంట్రీతో అక్కడ ఉన్న టి‌డి‌పి నేతలు ఐక్యంగా ముందుకెళ్లడంతో ఇప్పుడు టి‌డి‌పిలో వివాదం సద్దుమణిగినట్లే కనిపిస్తుంది. చాలా రోజుల నుంచి సత్తెనపల్లిలో టి‌డి‌పి ఇంచార్జ్ అంశంపై రచ్చ నడుస్తోంది. ఎప్పుడైతే కోడెల శివప్రసాద్ చనిపోయారో..అప్పటినుంచి అక్కడ ఇంచార్జ్ లేరు. ఇక కోడెల తనయుడు శివరాం..ఈ సీటు కోసం ప్రయత్నించారు. అటు మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు, టి‌డి‌పి నేత శివనగమల్లేశ్వరరావు, రాయపాటి రంగబాబు ఇలా కొందరు నేతలు సీటు ఆశించారు.

కానీ చంద్రబాబు వీరెవరిని కాదని బి‌జే‌పి నుంచి కన్నా లక్ష్మీనారాయణని టి‌డి‌పిలోకి తీసుకుని ఆయనకు సత్తెనపల్లి ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. దీంతో కోడెల తనయుడుకు అన్యాయం చేస్తున్నారనే వాదన వచ్చింది. ఇటు కోడెల తనయుడు కూడా ఫైర్ అయ్యారు. తమ ఫ్యామిలీని రాజకీయాల్లో లేకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సత్తెనపల్లిలో కన్నాకు కోడెల తనయుడు సహకారం అందించడం లేదు. కోడెల సెపరేట్ గా రాజకీయం చేసుకుంటున్నారు.

దీంతో సత్తెనపల్లిలో రచ్చ కొనసాగుతుంది. ఇలా రచ్చ నడుస్తున్న సమయంలోనే సత్తెనపల్లిలో లోకేష్ పాదయాత్ర ఎంట్రీ ఇచ్చింది. ఈ పాదయాత్రలో ఓ వైపు కన్నా.. మరో వైపు కోడెలని పెట్టుకుని లోకేష్ ముందుకెళ్లారు. దీంతో సత్తెనపల్లిలో విభేదాలు తగ్గినట్లే అని తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారు. కానీ ఇది పాదయాత్ర వరకే అని, తర్వాత ఎవరి పని వారిదే అని చెప్పుకొస్తున్నారు.

అయితే సత్తెనపల్లి సీటు విషయంలోనే రచ్చ ఉంది. కన్నాని ఇంచార్జ్ గా పెట్టడంతో ఆయనకే సీటు ఖాయమని తెలుస్తోంది. దీంతో కోడెల తనయుడుకు సీట్లు లేదు. ఈ క్రమంలో కోడెల తనయుడు ఎన్నికల సమయంలో ఏం చేస్తారనేది కీలకంగా మారింది. ఆయనకు వేరే పదవి ఇస్తామని చెప్పి..కన్నాతో కలిసి పనిచేసేలా చేస్తారా? లేక ఆయనని పక్కన పెట్టేస్తారో చూడాలి.