టీడీపీ నేతల్లో అతివిశ్వాసం….. కారణం అదేనా…!

రాబోయే ఎన్నికలు ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి కత్తి మీద సాములాంటివనేది రాజకీయ విశ్లేషకుల మాట. అందుకే టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ఎన్నికలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వరుస పర్యటనలు, అభ్యర్థుల ఎంపిక, మ్యానిఫెస్టో ప్రకటన వంటివి ఇప్పటి నుంచే చేసేస్తున్నారు. క్యాడర్‌కు కూడా పార్టీ గెలుపు ఎంత ముఖ్యమో ఇప్పటి నుంచే చెబుతున్నారు చంద్రబాబు. అయితే అధినేత తీరుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు నియోజకవర్గాల్లో నేతలు.

ఏపీలో ఎన్నికలకు ఇంకా 9 నెలలు గడువుంది. అయినా సరే… ఇప్పటికే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు టీడీపీ నేతలు. ఏడాది క్రితమే బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఇక అధినేత చంద్రబాబు కూడా మినీ మహానాడు, బాదుడే బాదుడు అంటూ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మరోవైపు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ కూడా యువగళం పేరుతో ఈ ఏడాది జనవరి 27వ తేదీ నుంచి పాదయాత్ర చేస్తున్నారు. చంద్రబాబు కూడా నెలలో 20 రోజులు ప్రజల మధ్య ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే ప్రాజెక్టుల పర్యటన అంటూ యుద్ధభేరీ పేరుతో పది రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించారు.

అధినేత, యువనేత పర్యటనలకు ప్రజలు భారీ ఎత్తున తరలివస్తున్నారు. అలాగే అధినేత నిర్వహించే సభలకు పబ్లిసిటీ కూడా బాగానే వస్తుంది. వీటికి తోడు పలు చోట్ల ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నారు. పులివెందుల, పుంగనూరు, పోలవరం ఘటనలపైన మీడియాలో బాగానే హైలెట్ అయ్యాయి. ప్రజా స్పందన కూడా బాగానే ఉందని అధినేతకు రిపోర్టు అందుతోంది. దీంతో మనం గెలిచేశాం అనే ధీమాలో తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నియోజకవర్గాల్లో పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలు చేయడంలో అలసత్వం చూపుతున్నారు. కీలకమైన ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియనే టీడీపీ నేతలు లైట్ గా తీసుకున్నారు. దీనిపై అధినేత చంద్రబాబు సైతం నియోజకవర్గం స్థాయి నేతలపై ఆగ్రహంతో ఉన్నారు. ఇలా అయితే వేటు తప్పదని హెచ్చరించారు కూడా.