జమిలి ఎన్నికలు… తేల్చేసిన కేంద్రం…!

దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనేది మోదీ సర్కార్ మొదటి నుంచి చేస్తున్న ప్రతిపాదన. రాష్ట్రంలో ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగడం వల్ల ఖర్చుతో పాటు అభివృద్ధికి ఆటంకం కలుగుతుందనేది ప్రధానంగా చెబుతున్నారు. రాష్ట్రాల్లో విడిగా ఎన్నికలు జరగడం వల్ల ఖర్చుతో పాటు… వాటి ప్రభావం కూడా పార్లమెంట్ ఎన్నికలపై స్పష్టంగా ఉంటుందనేది మోదీ సర్కార్ మాట. అందుకే దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనేది మోదీ సర్కార్ మాట. ఈ జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం ఎప్పటి నుంచో కసరత్తు చేస్తున్నప్పటికీ… అది ఆచరణలో సాధ్యం కావడం లేదు. తాజాగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కూడా జమిలీ ఎన్నికల ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటిని కొద్ది రోజుల పాటు వాయిదా వేయడంతో పాటు… ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలను రెండు నెలలు ముందుగా నిర్వహించడం ద్వారా జమిలి ఎన్నికలు సాధ్యమనే మాట కూడా వినిపించింది.

అయితే జమిలీ ఎన్నికల నిర్వహణపై కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి క్లారిటీ ఇచ్చేశారు. జమిలీ ఎన్నికలు కష్టమని పార్లమెంట్ సాక్షిగా వెల్లడించారు. రాజ్యసభలో ఎంపీలు అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానంలో పూర్తి వివరాలు అందించారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ అంత సులభం కాదన్నారు. ఒకేసారి ఎన్నికల నిర్వహణ వల్ల అనేక లాభాలు ఉన్నప్పటికీ… అందుకు చాలా అవరోధాలు, అడ్డంకులు ఉన్నాయన్నారు అర్జున్ రామ్ మేఘ్వాల్. కనీసం ఐదు కీలక రాజ్యాంగ సవరణలు అవసరమన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో ఏకాభిప్రాయం సాధించాలని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున ఈవీఎంలు, వీవీ పాట్స్ మిషన్స్ అవసరం అని వెల్లడించారు. అందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని క్లారిటీ ఇచ్చేశారు. ఈవీఎం, వీవీ పాట్స్ మిషన్లు 15 సంవత్సరాల కంటే ఎక్కువ పని చేయవని తేల్చేశారు. ప్రతి 15 ఏళ్లకు కొత్త ఈవీఎం, వీవీ పాట్స్ తీసుకోవాలని.. ఒకేసారి అంత పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేయాలని వెల్లడించారు.

ఒకేసారి ఎన్నికల నిర్వహణకు భారీగా పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాలు అవసరం అని వెల్లడించిన న్యాయ శాఖ మంత్రి అర్జున్.. ఒకేసారి ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే కేంద్ర సిబ్బంది, న్యాయ శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలన చేసిందని కూడా స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సహా సంబంధిత భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపిందని… తదుపతి రోడ్ మ్యాప్ రూపకల్పనకై ప్రస్తుతం లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పష్టం చేశారు.