బాబు మేనిఫెస్టో..టార్గెట్ 175..పులివెందుల కూడా..!

మొన్నటివరకు జగన్..175కి 175 స్థానాలు గెలవాలని వైసీపీ నేతలకు దిశానిర్దేశం చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. పంచాయితీ, పరిషత్, మున్సిపాలిటీ ఇలా అన్నీ ఎన్నికల్లో 90 శాతం పైనే గెలిచామని, ఇంకా అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లు ఎందుకు గెలవలేమని వైసీపీ నేతలకు సూచించారు. కుప్పంలో కూడా సత్తా చాటమని, కాబట్టి 175 సీట్లు గెలవడం కష్టమేమీ కాదని చెప్పుకొచ్చారు.

ఇక జగన్‌కు పోటీగా చంద్రబాబు సైతం 175 సీట్లలో గెలుపే టార్గెట్ గా పెట్టుకున్నారు. తాజాగా రాష్ట్రంలో టి‌డి‌పి మినీ మేనిఫెస్టోని ప్రజలకు వివరించేలా ఐదు జోన్లలో బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ బస్సు యాత్ర 125 స్థానాల్లో జరగనుంది. దీని ద్వారా ప్రజలకు టి‌డి‌పి మేనిఫెస్టో అర్ధమయ్యేలా చెప్పనున్నారు. టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోలోని సూపర్‌ సిక్స్‌ హామీలు అమల్లోకి వస్తే ఐదేళ్లలో సరాసరిన ప్రతి కుటుంబానికీ రూ.6 లక్షల వరకూ అదనపు ఆదాయం సమకూరుతుందని బాబు అన్నారు.

18 నుంచి 59 ఏళ్ల వయసు మహిళలు కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికీ నెలకు రూ.1,500, ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంత మంది ఉంటే అంత మందికీ తలకు రూ.15 వేలు, ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, జిల్లా వరకూ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సమకూరుస్తామని,  రైతులకు ఏడాదికి రూ. 20 వేలు, నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు ఇస్తామని..ఇది మొదటి విడత మేనిఫెస్టో అని, ఇక దసరా నాటికి పూర్తి మేనిఫెస్టో విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు.

అలాగే ఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 175 సీట్లు మనవే కావాలని, మంచి అభ్యర్థులను పెట్టుకుని గట్టిగా పనిచేస్తే సీట్లన్నీ ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని,  పులివెందులలో కూడా ఈసారి మన జెండానే ఎగరాలని అన్నారు. అయితే ప్రజలు ఎవరికి 175 ఇవ్వలేరు గాని అధికారం ఎవరికి ఇస్తారో చూడాలి.