టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు..ఇంకా లైన్‌లోనే..!

ఏపీలో మైండ్ గేమ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మొన్నటివరకు ప్రతిపక్ష టీడీపీని దెబ్బతీసేందుకు అధికార వైసీపీ మైండ్ గేమ్ ఆడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు రివర్స్‌లో టి‌డి‌పి మైండ్ గేమ్ ఆడటం మొదలుపెట్టింది. మొన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలని ఇటు తిప్పుకుని క్రాస్ ఓటు వేయించుకుని గెలిచిన టీడీపీ..అక్కడ నుంచి వైసీపీతో మైండ్ గేమ్ ఆడుతూనే ఉంది.

చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. దాదాపు 16 మంది టచ్ లో ఉన్నారని మొదట చెప్పారు..ఇప్పటికీ ఎమ్మెల్యేలు టచ్ లోనే ఉన్నారని, తమతో చర్చలు జరుపుతున్నారని టి‌డి‌పి నేతలు అంటున్నారు. తాజాగా టి‌డి‌పి సీనియర్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అదే తరహాలో మాట్లాడారు.  సొంత ఎమ్మెల్యేలకు జగన్‌పై నమ్మకం లేకపోతే.. 175 సీట్లు గెలుస్తామనడం హస్యాస్పదమని, ఎమ్మెల్యేలని కొనేంత డబ్బు టీడీపీ పార్టీ వద్ద లేదని, నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలనే జగన్ కోనుగోలు చేశారని, ఎంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తారో చెప్పలేను కానీ.. చాలా మంది ఎమ్మెల్యేలు వైసీపీ అధినాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారని  చెప్పుకొచ్చారు.

అటు పొత్తుపై కూడా రాజప్ప మాట్లాడారు..పొత్తు విషయం చంద్రబాబు చూసుకుంటారని, అయితే జనసేనతో పొత్తు బాగుంటుందని చెప్పుకొచ్చారు. అప్పుడు సులువుగా వైసీపీకి చెక్ పెట్టవచ్చని అంటున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు ఎంతమంది టి‌డి‌పిలోకి వస్తారో తెలియడం లేదు. కానీ వచ్చిన వారందరికి సీట్లు దక్కడం కష్టమే అని టి‌డి‌పి నేతలు తేల్చేస్తున్నారు. గతంలో అలాగే వైసీపీ నుంచి టి‌డి‌పిలోకి వచ్చిన వారికి సీట్లు ఇవ్వడం వల్ల టి‌డి‌పి బాగా నష్టపోయింది..ఈ సారి అలాంటి ప్రయోగం చేయరని అంటున్నారు. చూడాలి మరి ఎంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు టి‌డి‌పిలోకి వస్తారో.