మంత్రివర్గంలో మార్పులు…ఆ నలుగురు అవుట్?

ఏపీలో మరోసారి మంత్రివర్గంలో మార్పులపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో జగన్..పనితీరు బాగోని మంత్రులని పక్కన పెట్టి వారి స్థానాల్లో కీలక నేతలకు పదవులు ఇవ్వాలని చూస్తున్నట్లు తెలిసింది. అయితే ఇప్పటికే రెండుసార్లు జగన్ మంత్రివర్గంలో మార్పులు చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో మండలి రద్దు అని చెప్పి..ఎమ్మెల్సీ కోటాలో మంత్రులైన పిల్లి సుభాష్, మోపిదేవి వెంకటరమణలని తప్పించి..చెల్లుబోయిన వేణుగోపాల్, సీదిరి అప్పలరాజులని మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

ఇక అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్న సమయంలో 14 మంది పాతవాళ్లని తప్పించి..కొత్తగా 14 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే చివరిసారిగా మార్పులు చేయడమని అంతా అనుకున్నారు. కానీ ఇటీవల కాలంలో కొందరు మంత్రుల పనితీరు పట్ల జగన్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అవసరమైతే ముగ్గురు, నలుగురు మంత్రులని మార్చడానికి కూడా వెనుకాడనని అన్నారు.

ఈ నేపథ్యంలో ఆయన మంత్రివర్గంలో మార్పులు చేయడానికి రెడీ అయ్యారని తెలిసింది. ఈ క్రమంలోనే తాజాగా మంత్రి అప్పలరాజుని సి‌ఎం తన కార్యాలయానికి పిలుపించుకున్నారని తెలిసింది. దీంతో అప్పలరాజుతో పాటు రాయలసీమకు చెందిన ఓ మహిళా మంత్రి, గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులని జగన్ పక్కన పెట్టేస్తారని ప్రచారం వస్తుంది.

వారి స్థానాల్లో స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం, కొడాలి నాని, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ మర్రిర్ రాజశేఖర్‌ని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని ప్రచారం వస్తుంది. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.