టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల స్క్రిప్ట్..అప్పుడే తేలిపోయిందా!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన రచ్చ ఇంకా ఆగలేదు. వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టి‌డి‌పికి క్రాస్ ఓటు చేయడంపై వైసీపీ నేతలు ఫైర్ అవుతూనే ఉన్నారు. వారంతా డబ్బులకు అమ్ముడుపోయారని విమర్శిస్తున్నారు. అలాగే ఆ నలుగురు ఎమ్మెల్యేలని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే సస్పెండ్ అయిన నలుగురు..వైసీపీపై విరుచుకుపడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి టార్గెట్ గా ఫైర్ అవుతున్నారు.

అసలు తమని పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి సజ్జల ఎవరు అని అంటున్నారు. ఇక వరుసపెట్టి వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టడం చంద్రబాబుపై విమర్శలు చేయడం చేస్తున్నారు. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే..టి‌డి‌పి, జనసేన నుంచి వైసీపీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు సైతం విమర్శలు చేయడం..వారికి చంద్రబాబు డబ్బులు ఆఫర్ చేశారని ఆరోపించడం. జనసేన నుంచి వైసీపీ వైపుకు వెళ్ళిన రాపాక వరప్రసాద్..టి‌డి‌పి తనకు ఆఫర్ ఇచ్చిందని, 10 కోట్లు ఇస్తామని అన్నారని, టి‌డి‌పికి క్రాస్ ఓటింగ్ చేయాలని అడిగారని చెప్పుకొచ్చారు.

అంతకముందు టి‌డి‌పి నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ..చంద్రబాబు టార్గెట్ గా ఫైర్ అయిన విషయం  తెలిసిందే. ఎమ్మెల్యేలని కొనడం చంద్రబాబుకు అలవాటు అని చెప్పుకొచ్చారు. ఇక టి‌డి‌పి నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళిన మరో ఎమ్మెల్యే మద్దాలి గిరి సైతం అదే తరహాలో విమర్శలు చేశారు. ఇక తనకు కూడా డబ్బులు ఆఫర్ చేశారని, టి‌డి‌పికి ఓటు వేయాలని అడిగారని, కావాలంటే కాల్ రికార్డు చూసుకోవచ్చని అన్నారు.

అయితే ఇక్కడ కొన్ని లాజిక్‌లు ఉన్నాయి..అసలు ఇప్పుడు మాట్లాడే వారు టి‌డి‌పి, జనసేనల నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళినవారు..వారు వచ్చి నీతులు చెప్పడం విచిత్రమే. అలాగే డబ్బులు ఆఫర్ చేశారనుకుంటే ఎన్నిక సమయంలోనే చెప్పవచ్చు..మరి ఇప్పుడు వచ్చి చెబుతున్నారంటే..పక్కా స్క్రిప్ట్ అల్లుకున్నట్లే కనిపిస్తున్నారు.