ఎమ్మెల్యే అవుతా..సీటు ఎక్కడ బుద్దా?

విజయవాడ తెలుగుదేశంలో జరిగే అంతర్గత రాజకీయాలు ఎప్పుడు వివాదాస్పదం అవుతాయనే చెప్పాలి. అక్కడ సొంత పార్టీ నేతలతోనే పడదు. ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలకు పడని విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు వారి మధ్య బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. ముఖ్యంగా విజయవాడ వెస్ట్ సీటు విషయంలో వారి మధ్య రచ్చ జరుగుతూనే ఉంది. ఈ సీటు కోసం పోటీ పడుతున్నారు.

అయితే ప్రస్తుతం ఆ సీటుకు ఇంచార్జ్ గా కేశినేని నాని ఉన్నారు..అయినా సరే బుద్దా వర్గం వెస్ట్ సీటుని వదలడం లేదు. అక్కడ ఏదొక విధంగా రాజకీయం చేస్తూనే ఉంది. అసలు గత ఎన్నికల్లో జలీల్ ఖాన్ కుమార్తె ఓడిపోయేలా బుద్దా వర్గమే పనిచేసిందనే విమర్శలు ఉన్నాయి. ఆ విషయం పక్కన పెడితే..ఇప్పటికీ అక్కడ రచ్చ జరుగుతుంది. కేశినేని ఇంచార్జ్ గా ఉన్నా సరే అక్కడ ఏదొక విధంగా రాజకీయం చేస్తూ…కేశినేని సోదరుడు కేశినేని శివనాథ్ ద్వారా..కార్యక్రమాలు చేస్తున్నారు.

పైగా కేశినేనికి చెక్ పెట్టడానికి ఆయన తమ్ముడు శివనాథ్‌కు బుద్దా వర్గం సపోర్ట్ చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా బుద్దా వర్గం వెస్ట్ నియోజకవర్గంలో ఓ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో బుద్దా సంచలన వ్యాఖ్యలు చేశారు.  2024 ప్రత్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, అసెంబ్లీలో చంద్రబాబు వెనుక కూర్చుని ఆయన్ని అవమానించిన వారి అంతు చూస్తామన్నారు. తాను, నాగుల్ మీరా ఇద్దరం ఈసారి చట్ట సభల్లో అడుగుపెడతామని బుద్దా చెప్పారు.

ఇక ఈయనే కాకుండా..నాగుల్ మీరాకు కూడా సీటు అంటున్నారు. అసలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏ సీటు ఖాళీ లేదు. ఉన్నది కాస్త విజయవాడ వెస్ట్ మాత్రమే..జనసేనతో పొత్తు ఉంటే ఆ సీటుని..ఆ పార్టీకే కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది. మరి అలాంటప్పుడు బుద్దా, నాగుల్ మీరా ఎక్కడ పోటీ చేస్తారో మరి.