ఆర్ కృష్ణయ్యతో ‘ఫ్యాన్’ రివర్స్..బీసీల్లో నో ప్లస్..?

ప్రజల కోసం ఏదైనా చేసి..వారి మద్ధతు పొంది మళ్ళీ గెలవడమే రాజకీయ పార్టీల లక్ష్యం. కానీ ఏపీ రాజకీయాల్లో ఇలాంటి ఫార్ములా ఉండదు. కులాల పరంగా రాజకీయం చేయడం..కులాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రత్యర్ధి పార్టీలకు కులాల ఆధారంగా ఓట్లని దూరం చేయడమే జరుగుతుంది. ఈ కుల రాజకీయాన్ని అన్నీ పార్టీలు నడిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇందులో అధికార వైసీపీ మాత్రం ఆరితేరిపోయి ఉందని విశ్లేషకులు పదే పదే చెబుతూనే ఉన్నారు.

ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ వైసీపీకి వ్యూహకర్తగా వచ్చారో అప్పటినుంచి కులాల కుంపటి నడుస్తూనే ఉంది. ప్రశాంత్ కిశోర్ సైడ్ అయినా సరే వైసీపీ మాత్రం అదే తరహాలో ముందుకెళుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీ, ఎస్సీ, కాపుల ఓట్ల టార్గెట్‌గా ముందుకెళుతుంది. ఈ మూడు కులాల ఓట్లు టీడీపీకి దూరం చేసి..తాము లబ్ది పొందాలనేది వైసీపీ టార్గెట్‌గా ఉంది. ఎలాగో మూడు రాజధానుల ద్వారా ప్రాంతాల మధ్య కూడా రాజకీయం నడుస్తోంది.

తమ పార్టీలో ఉండే ఎస్సీ నేతల చేత ఒకలా రాజకీయం, కాపు నేతల చేత మరొకలా, బీసీల చేత ఇంకోలా రాజకీయ గేమ్ ఆడించేస్తున్నారు. ఎవరికి వారు సెపరేట్‌గా సభలు, సమావేశాలు పెట్టడం చంద్రబాబు తమ కులాన్ని మోసం చేశారని, జగన్ తమకు అండగా ఉన్నారనే విధంగా స్పీచ్‌లు ఇస్తున్నారు. తాజాగా వైసీపీ కాపు నేతలు సెపరేట్‌గా సమావేశం పెట్టుకుని..పవన్-చంద్రబాబుని టార్గెట్ చేశారు. కాపులకు జగన్ అద్బుతమైన సేవ చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

ఆ మధ్య బీసీ నేతలతో కూడా సెపరేట్‌గా కార్యక్రమం చేయించారు. అలాగే ఆర్ కృష్ణయ్య లాంటి జాతీయ బీసీ నేత ద్వారా రాజకీయం నడిపిస్తున్నారు. బీసీలకు జాతీయ అధ్యక్షుడుగా ఉన్న కృష్ణయ్యకు..జగన్ రాజ్యసభ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో కృష్ణయ్య..జగన్‌కు భజన చేయడం, బీసీలకు వైసీపీ హయాంలో బాగుపడిపోతున్నారనే విధంగా బీసీలని జగన్ వైపు తిప్పే కార్యక్రమాలు చేస్తున్నారు.

కానీ కృష్ణయ్య వల్ల ఒక్క బీసీ ఓటు కూడా మారేలా కనిపించడం లేదు..అవసరాన్ని బట్టి రంగుల మారుస్తున్న కృష్ణయ్యని సొంత బీసీ సంఘంలోనే నేతనే నమ్మడం లేదని తెలుస్తోంది. పైగా జగన్ హయాంలో బీసీలకు ఒరిగింది ఏంటి అనేది..ఆ బీసీ ప్రజలకే తెలియాలని విశ్లేషకులు అంటున్నారు.  56 కార్పొరేషన్లు పెట్టారు గాని..ఒక్క కులానికి నిధులు ఇవ్వడం లేదు..వారిని ఆదుకోవడం లేదు. మొత్తానికైతే కృష్ణయ్య వల్ల వైసీపీకే రివర్స్ అవుతుంది.