ప్రధాని మోదీ రెండురోజుల పాటు ఏపీలో పర్యటించనున్న విషయం తెలిసిందే..విశాఖలో పర్యటించి అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించనున్నారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ…మోదీకి ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాకపోతే బీజేపీ కంటే ఎక్కువగా వైసీపీ హడావిడి కనిపిస్తోంది. మోదీ పర్యటనని విజయవంతం చేయడమే కాకుండా..ఆంధ్రా యూనివర్సిటీలో జరిగే సభని భారీ సక్సెస్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మోదీ సభకు పెద్ద ఎత్తున జనాలని తరలించే పనిలో వైసీపీ ఉంది.
అంటే మోదీ మెప్పు పొందడానికి వైసీపీ గట్టిగానే కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది..అయితే మోదీ పర్యటనకు ప్రతిపక్షాలని రానివ్వకుండా చేయడమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తుంది. ఆ మధ్య అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరణ సమయంలో ప్రతిపక్షలకు చోటు ఇవ్వలేదు. ముఖ్యంగా బీజేపీ మిత్రపక్షంగా ఉన్న పవన్ కల్యాణ్‌ని దూరం పెట్టారు. ఇప్పుడు విశాఖ పర్యటనలో కూడా అదే జరుగుతుంది. కానీ ఊహించని విధంగా మోదీ నుంచే పవన్‌కు ఆహ్వానం అందింది.
శుక్రవారం సాయంత్రం నుంచి విశాఖపట్నంలో అందుబాటులో ఉండాలని పవన్‌కు బీజేపీ నుంచి సమాచారం అందింది. నేవీ అతిథిగృహం ఐఎన్‌ఎస్ చోళాలో శుక్రవారం రాత్రి 8.30 గంటలకు బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో మోదీ సమావేశం కానున్నారు. ఆ తర్వాత పవన్‌ను విందు భేటీలో కలుస్తారని తెలిసింది. ఒకవేళ ఆ సమయంలో కుదరకపోతే శనివారం ఉదయం అల్పాహారం సమయంలో కలుసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
మొత్తానికి మోదీకి పవన్‌ని దూరంగా ఉంచాలనే వైసీపీ ప్లాన్ పెద్దగా వర్కౌట్ అవుతున్నట్లు కనిపించడం లేదు. పైగా ఇటీవల పవన్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీ నేతలతో వచ్చిన గ్యాప్.. పవన్‌ను సరిగా ఉపయోగించుకోవడం లేదంటూ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలను మోదీ దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, వైసీపీ అరాచక పాలనను పవన్..ఈ సందర్భంగా ప్రధానికి వివరిస్తారని సమాచారం. చూడాలి మరి మోదీ-పవన్ భేటీ ఎలాంటి రాజకీయ మలుపులు తిరుగుతుందో.