కోట్ల-కే‌ఈ-భూమా ఫ్యామిలీలకు ‘బీసీ’ చెక్?

కర్నూలు జిల్లా టీడీపీ అంటే అందరికీ ఎక్కువ గుర్తొచ్చేది కే‌ఈ ఫ్యామిలీ..ఆ తర్వాత భూమా ఫ్యామిలీ..ఇక 2019 ఎన్నికల నుంచి కోట్ల ఫ్యామిలీ కూడా టీడీపీలోకి వచ్చింది. ఈ మూడు ఫ్యామిలీలు కర్నూలు జిల్లాలో టీడీపీలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఒక్కో ఫ్యామిలీ చేతిలో రెండు సీట్లు ఉన్నాయి. అయితే ఈ పరిస్తితి మొన్నటివరకే..కానీ తర్వాత సీన్ మారిపోయింది. సరిగ్గా యాక్టివ్ గా పనిచేయకపోవడం, అనుకున్న మేర పార్టీని బలోపేతం చేయడంలో విఫలమవుతుండటంతో చంద్రబాబు జిల్లాలో మార్పులు చేశారు.

ఈ మార్పుల్లో బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిసింది. జిల్లాలో ఆయన హవా పెంచుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నట్లు తెలిసింది. 2014లో జిల్లాలో టీడీపీ మూడు సీట్లే గెలిస్తే..అందులో ఒకరు బీసీ. అలాగే 2019 ఎన్నికల్లో జిల్లాలో నేతలంతా భారీ మెజారిటీలతో ఓడిపోతే బీసీ మాత్రం తక్కువ మెజారిటీతోనే ఓడిపోయారు.

ఇక వైసీపీకి భయపడి చాలారోజుల పాటు నేతలు బయటకు రాలేదు..కానీ బీసీ గట్టిగా పోరాటం చేశారు..జైలుకు కూడా వెళ్లారు. తన స్థానంలో బలం కూడా పెంచుకున్నారు. తన స్థానంలోనే కాకుండా..ఆ మూడు ఫ్యామిలీలకు చెందిన స్థానాలపై కూడా బీసీ ఫోకస్ చేశారని సమాచారం. ఇదే క్రమంలో బీసీ సపోర్ట్‌తోనే కే‌ఈ ఫ్యామిలీ చేతులో ఉన్న డోన్ సీటుని సుబ్బారెడ్డికి దక్కేలా చేశారు. నెక్స్ట్ సుబ్బారెడ్డి పోటీ చేస్తారని బాబు కూడా ప్రకటించేశారు. డోన్ పోవడంతో కేవలం కే‌ఈ ఫ్యామిలీకి పత్తికొండ మిగిలింది.

అటు భూమా ఫ్యామిలీ చేతుల్లో ఉన్న ఆళ్లగడ్డ, నంద్యాలలో ఒక సీటు పోయేలా ఉంది. ఒక సీటులో మైనారిటీ కోటలో ఫరూక్ తనయుడు ఫిరోజ్‌ పోటీ చేసేలా స్కెచ్ వేస్తున్నారట. అటు కోట్ల ఫ్యామిలీ చేతిలో కర్నూలు ఎంపీ సీటు, ఆలూరు అసెంబ్లీ సీటు ఉన్నాయి. ఆలూరులో కోట్ల సుజాతమ్మ ఉన్నారు. ఈ స్థానంలో బోయ లేదా, కురుబ వర్గాలకు చెందిన ఒక నేతని బరిలో దింపాలని ప్రతిపాదిస్తున్నారట. మొత్తానికి కర్నూలుపై బీసీ పట్టు పెంచుకునేలా ఉన్నారు.