గన్నవరంలో ట్విస్ట్: వంశీ-వైసీపీ..యార్లగడ్డ-టీడీపీ?

గత ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో ప్రత్యర్ధులుగా పోటీ చేసిన వల్లభనేని వంశీ-యార్లగడ్డ వెంకటరావు..మళ్ళీ ప్రత్యర్ధులుగా దిగబోతున్నారా?  అంటే అవుననే గన్నవరంలోని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అదేంటి యార్లగడ్డ వైసీపీలో ఉన్నారు..అటు టీడీపీ నుంచి గెలిచిన వంశీ కూడా వైసీపీ వైపుకు వచ్చారు కదా..మరి అలాంటప్పుడు ఇద్దరు నేతలు ప్రత్యర్ధులుగా ఎలా పోటీ చేస్తారని డౌట్ రావొచ్చు.

అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అది చెప్పుకునే ముందు ఒకసారి గత ఎన్నికల గురించి మాట్లాడుకుంటే..గత ఎన్నికల్లో వంశీ టీడీపీ నుంచి, యార్లగడ్డ వైసీపీ నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే హోరాహోరీ పోరులో స్వల్ప మెజారిటీతో వంశీ గెలిచి బయటపడ్డారు. తర్వాత వైసీపీ అధికారంలోకి రావడం, తన మిత్రుడు కొడాలి నాని మంత్రి కావడంతో..వంశీ వైసీపీ వైపుకు వచ్చారు. అక్కడ నుంచి గన్నవరంలో వర్గ పోరు మొదలైంది వంశీ-యార్లగడ్డ వర్గాలకు పడటం లేదు. అలాగే వంశీతో దుట్టా రామచంద్రరావు కూడా విభేదిస్తున్నారు.

ఈ విభేదాల నడుమ గన్నవరం సీటు ఎవరికి దక్కుతుందనే సస్పెన్స్ నడిచింది. కాకపోతే ఆ మధ్య కొడాలి నాని..గన్నవరం సీటు వంశీకే అని ప్రకటించారు. కానీ వైసీపీ అధిష్టానం నుంచి క్లారిటీ రాలేదు. అయితే తాజాగా వంశీ..జగన్‌ని కలిశాక క్లారిటీ వచ్చిందట. ఇటీవల జరిగిన వైసీపీ వర్క్ షాపుకు వంశీ హాజరు కాలేదు..అలాగే గడపగడపకు కార్యక్రమంలో కూడా వెనుకబడ్డారు. దీనిపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది.

అదే సమయంలో తన సీటుపై క్లారిటీ రాకపోవడం, అలాగే వైసీపీ తీసుకున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్ణయాలపై వంశీ అసంతృప్తిగా ఉండి కాస్త వైసీపీకి దూరంగా ఉన్నారని ప్రచారం జరిగింది. కానీ తాజాగా సీటు విషయంలో క్లారిటీ రావడంతో వంశీ-జగన్‌ని కలిశారని తెలుస్తోంది. అలాగే ఇక నుంచి గడపగడపకు వెళ్తానని, నియోజకవర్గంలో యాక్టివ్‌గా తిరుగుతానని వంశీ, జగన్‌కు వివరించి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నెల నుంచి వంశీ గన్నవరంలో ఇంకా యాక్టివ్ అవుతారని తెలుస్తోంది. సీటు ఫిక్స్ కావడంతోనే వంశీ..ఇంకా దూకుడుగా ఉండనున్నారు.

వంశీకి సీటు దాదాపు ఖాయం కావడంతో యార్లగడ్డ పరిస్తితి ఏంటి అని, ఆయన అనుచరులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒకవేళ వంశీని విజయవాడ ఎంపీగా పంపి, యార్లగడ్డకు గన్నవరం సీటు ఇస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు వంశీకే గన్నవరం ఫిక్స్ అవుతుంది. ఈ క్రమంలో అనుచరులు..యార్లగడ్డని టీడీపీలోకి వెళ్ళమని ఫోర్స్ చేస్తున్నట్లు తెలిసింది. టీడీపీకి ఎలాగో సరైన నాయకుడు లేరు. కాబట్టి టీడీపీలోకి వెళితే సీటు ఖాయమని అంటున్నారట. మొత్తానికి గన్నవరంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా ఉన్నాయి.