బాలినేని వర్సెస్ వైవీ..డ్యామేజ్ పెరిగేలా..!

అధికార వైసీపీలో ఎక్కడకక్కడ వర్గపోరు నడుస్తుందనే సంగతి  తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతలకే పడని పరిస్తితి. కీలక నేతల మధ్యే ఆధిపత్య పోరు నడుస్తోంది. చాలాసార్లు ఈ సొంత పోరుకు చెక్ పెట్టడానికి జగన్ చాలాసార్లు ట్రై చేశారు గాని..అది పెద్దగా వర్కౌట్ అయినట్లు కనిపించలేదు. ఇప్పటికీ పలు చోట్ల పోరు నడుస్తోంది. ముఖ్యంగా సీఎం జగన్ బంధువులైన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిల మధ్య సైలెంట్ వార్ ఎప్పటినుంచో నడుస్తోంది.

పైగా వీరిద్దరు కూడా బంధువులే..వరుసకు బావాబామ్మర్దులు అవుతారు. ఒకప్పుడు వీరు కలిసే పనిచేశారు. కానీ తర్వాత వీరి మధ్య ఆధిపత్య పోరు పెరిగింది..దీంతో జగన్..వైవీని ఉత్తరాంధ్ర ఇంచార్జ్‌గా పంపారు..అలాగే టీటీడీ ఛైర్మన్‌గా చేశారు. దీంతో ప్రకాశం జిల్లాలో కాస్త పోరు తగ్గుతుందని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా బాలినేని,  వైవీల మధ్య ఆధిపత్య పోరు ఉంది. రెండు వర్గాల మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమనే పరిస్తితి.

ఇటీవల కూడా వీరి మధ్య సైలెంట్ పోరు నడిచింది. నవంబర్ 9న ఒంగోలులో పెద్ద ఎత్తున శ్రీనివాస కళ్యాణం నిర్వహిచాలని బాలినేని భావించారు..అలాగే దీనికి సంబంధించిన పర్మిషన్ కూడా టీటీడీ నుంచి తీసుకున్నారు. కానీ అనూహ్యంగా టీటీడీ ఛైర్మన్ అయిన వైవీ…దీనికి పర్మిషన్ ఇవ్వలేదని టీటీడీ అధికారులు బాలినేనికి సమాచారం ఇచ్చారు.

ఇదంతా వైవీ చేస్తున్నారని భావించి..ఈ పంచాయితీని జగన్ దగ్గర పెట్టారు బాలినేని. ఇక జగన్ కలుగజేసుకుని వైవీని పిలిపించుకుని బాలినేనికి లైన్ క్లియర్ అయ్యేలా చేశారు.  అయితే సమస్య ముగిసింది గాని..బాలినేని, వైవీల మధ్య అంతర్గత పోరు తగ్గడం లేదు. అసలే ప్రకాశం జిల్లాలో వైసీపీ బలం తగ్గుతూ వస్తుంది..ఇలాంటి సమయాల్లో కలిసి పనిచేసి, పార్టీని బలోపేతం చేయాల్సిన నాయకులు..ఇలా పోరు నడుపుతుంటే…పార్టీకే డ్యామేజ్ అయ్యేలా ఉంది.