క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఇంత లగ్జరీ అవసరమా? ఎందుకవన్నీ?

ప్రస్తుతం టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల రెమ్యూనరేషన్ హీరోల రెమ్యూనిరేషన్ కి ధీటుగా ఉంటోంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇదే విషయం ఇపుడు సినిమా నిర్మాతలను పట్టి పీడిస్తోందని టాలీవుడ్ టాక్. సినిమా ప్లాప్ అయితే హీరోకి, నిర్మాతకు, దర్శకుడికి మాత్రమే ఎక్కువ నష్టం. ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు పోయేది నిజంగా ఏమి ఉండదు. అలాగని వారు లేకుండా సినిమాలు ఎవరు తీయలేరు. టాలీవుడ్ లో కీలకమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల డిమాండ్లు ఇప్పుడు దారుణంగా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బాగా డిమాండ్ లో వున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒకరు తన రోజూ వారి రెమ్యూనిరేషన్ 5 లక్షలకు పెంచేసారని వినికిడి. అది కాక వారికోసం ఖచ్చితంగా 2 కార్లు పెట్టాలి. అలా అని వారు సరిగా టైమ్ కూడా మెయింటైన్ చేయడం లేదని టాక్. ఇక కోలీవుడ్ నుంచి ఇక్కడకు వచ్చి మంచి పేరు తెచ్చుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒకరు రోజుకు 3 లక్షలకు తన రెమ్యూనిరేషన్ తగ్గటం లేదట. తెలుగు టాప్ కమెడియన్లు కూడా రోజుకు 2 నుంచి 4 లక్షలు వసూలు చేస్తున్నారని సమాచారం. అందుకే వాళ్ల సీన్లు వీలయినంత తగ్గించి, బడ్జెట్ తగ్గించు కుంటున్నారట నిర్మాతలు.

ఒక్కో సినిమాకు ప్రధాన క్యారెక్టర్ ఆర్టిస్ట్ దాదాపు 20 నుంచి 60 రోజుల వర్క్ వుంటుంది. అంటే దాదాపు 1 కోటి నుంచి 2 కోట్లు ఖర్చు వారికోసమే అవుతుంది. ఈ క్రమంలో భారీగా రేట్లు పెంచిన క్యారెక్టర్ ఆర్టిస్టులను మెల్లగా పక్కన పెట్టాలని యోచనలో ఉన్నారట నిర్మాతలు. రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలు ఎంతచెప్పినా సదరు ఆర్టిస్టులు వినకపోవడంతో వేరే వాళ్లతో రీప్లేస్ చేయాలని అనుకుంటున్నారట. అలాగే ఈమధ్య జబర్దస్త్ షో ద్వారా పరిచయమైన వారు కూడా తగ్గడంలేదని… వీరిపైన కూడా నిర్మాతలు గుర్రుగా వున్నారని వినికిడి.