విడ‌ద‌ల ర‌జ‌నీకి మంత్రి ప‌ద‌వి ఇస్తే జ‌గ‌న్ రిస్క్‌లో ప‌డ్డ‌ట్టేనా ?

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త్వ‌ర‌లోనే త‌న కేబినెట్‌ను మారుస్తాన‌ని సంకేతాలు ఇచ్చేశారు. త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గంలో ఈ మార్పులు జ‌ర‌గ‌బోతున్నాయంటూ ఇటీవ‌ల జ‌రిగిన కేబినెట్ భేటీలో మంత్రుల‌కు జ‌గ‌న్ స్వ‌యంగా చెప్పేశారు. దీంతో ఇప్పుడు మంత్రి వ‌ర్గం నుంచి ఎవ‌రు బ‌య‌ట‌కు వెళ‌తారు ? ఎవ‌రు ఇన్ అవుతారు ? అన్న చ‌ర్చ‌లు ఆస‌క్తిగా న‌డుస్తున్నాయి. మ‌రీ ముఖ్య‌మంగా గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీ కూడా కేబినెట్లో చోటు కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆమె ఇంటి ద‌గ్గ‌ర‌, నియోజ‌క‌వ‌ర్గంలో హ‌డావిడి చూస్తుంటే ఆమె మంత్రి అయిపోతున్నార‌న్న హంగామా మామూలుగా లేదు.

స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి అండ‌దండ‌లు ఆమెకు పుష్క‌లంగా ఉన్నాయ‌ని.. అందుకే ఆమె బ‌ల‌మైన లాబీయింగ్‌తో మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం ఎమ్మెల్సీ కూడా రాకుండా అడ్డుకున్నార‌న్న ప్ర‌చార‌మూ ఉంది. ర‌క‌ర‌కాల ఈక్వేష‌న్ల‌లో ఒక‌వేళ ర‌జ‌నీకి జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వి ఇస్తే ఆ నిర్ణ‌యం ఖ‌చ్చితంగా బూమ‌రాంగ్ అయ్యే ప్ర‌మాదం ఉంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో క‌మ్మ వ‌ర్గంలోనే కాకుండా.. వైసీపీ అభిమానుల్లోనూ అది పార్టీ ప‌ట్ల వ్యతిరేక సంకేతాల‌ను ఖ‌చ్చితంగా ప్ర‌తిబింబిస్తుంది.

ఇవ‌న్నీ కాదు అస‌లు మాట ఇస్తే తండ్రి వైఎస్‌లా మ‌డ‌మ తిప్ప‌డు అన్న పేరున్న జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో చిల‌క‌లూరిపేట సీటు త్యాగం చేసినందుకు ఎమ్మెల్సీని చేసి మ‌రీ మంత్రిని చేసి మ‌ర్రిని కేబినెట్లో త‌న ప‌క్క‌న కూర్చోపెట్టుకుంటాన‌ని చెప్పారు. ప్ర‌భుత్వం వ‌చ్చి మూడేళ్లు అవుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు అస‌లు మ‌ర్రికి ఎమ్మెల్సీయే ఇవ్వ‌లేదు.. ఎన్నోసార్లు ఆశ‌లు పెట్ట‌డం.. తీరా ప‌ద‌వులు ఇచ్చేస‌రికి అన్యాయం చేయ‌డం జ‌రుగుతూనే వ‌స్తోంది.

ఇప్పుడు ర‌జ‌నీకి ఏదో లాబీయింగ్‌కు త‌లొగ్గి మంత్రి ప‌ద‌వి ఇస్తే అది పార్టీకి గుంటూరు జిల్లాలో పెద్ద మైన‌స్ అవుతుంద‌న్న ప్ర‌చారం పార్టీ వ‌ర్గాల్లోనే ఉంది. మంత్రిని చేస్తాన‌ని మ‌ర్రిని కాద‌ని.. ఇప్ప‌టికే ఆయ‌న త్యాగంతో ఎమ్మెల్యే అయిన ర‌జ‌నీకి మ‌ళ్లీ మంత్రి ప‌ద‌వి ఇస్తే జ‌గ‌న్ విశ్వ‌స‌నీయ‌త‌పైనా సందేహాలు వ‌స్తాయ‌ని పార్టీ వ‌ర్గాల్లోనే చ‌ర్చ న‌డుస్తోంది. పైగా జిల్లాకే చెందిన ఎస్సీ వ‌ర్గానికి చెందిన మ‌హిళానేత‌.. జ‌గ‌న్ పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి పార్టీలో ఉన్న హోం మంత్రి సుచ‌రిత‌ను త‌ప్పించి ర‌జ‌నీకి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డ‌మూ ఏ కోణంలోనూ స‌మ‌ర్థ‌నీయం కాదు.

ఇంకా చెప్పాలంటే జిల్లాలో ర‌జ‌నీ కంటే సీనియ‌ర్లు చాలా మందే ఉన్నారు. లేళ్ల అప్పిరెడ్డి, బ్ర‌హ్మ‌నాయుడు, శివ‌కుమార్‌, మేరుగ నాగార్జున వీళ్లంతా ర‌జ‌నీ కంటే చాలా చాలా సీనియ‌ర్లు. పైగా సుచరితను కొన‌సాగిస్తే.. జిల్లాకు మ‌రో మ‌హిళా మంత్రిని ఇవ్వ‌డ‌మూ ఇబ్బందే..! ఇన్ని కోణాల నేప‌థ్యంలో జ‌గ‌న్ ర‌జ‌నీకి మంత్రి ప‌ద‌వి ఇచ్చే రిస్క్ చేస్తాడా ? ఇన్ని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారా ? అన్న‌ది చూడాలి.