టీడీపీలో కొత్త చిచ్చు.. కుంప‌టి రాజేస్తోందెవ‌రు…!

ఏపీ ప్ర‌దాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో కొత్త చిచ్చు తెర‌మీదికి వ‌చ్చింది. నిన్న మొన్న‌టి వ‌రకు త‌మ‌కు ప‌ద‌వులు లేవ‌ని.. బాధ‌ప‌డ్డ త‌మ్ముళ్ల‌కు చంద్ర‌బాబు ప‌ద‌వులు అప్ప‌గించారు. ఇప్పుడు పార్టీలో ఉన్న సీనియ‌ర్లు, జూనియ‌ర్ల‌కు ఏదో ఒక ప‌ద‌వి ఉంది. అయితే.. ఈ ప‌ద‌వులు ఇచ్చినా.. పార్టీ ముందుకు సాగ‌క‌పోగా.. ప‌లు జిల్లాల్లో వివాదాలు.. చాప‌కింద నీరులా పారుతున్నాయి. దీంతో పార్టీ డెవ‌లప్‌మెంట్ అనేది ప‌క్క‌న పెట్టి వీధి పోరాటాల‌ను స‌ర్దుబాటు చేయ‌లేని ప‌రిస్థితి త‌లెత్తుతోంది. ప్ర‌స్తుతం ఉన్న ప‌ద‌వుల‌ను గ‌మ‌నిస్తే.. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఇంచార్జుల‌ను నియ‌మించారు. అదేస‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గాల‌కు చాలా చోట్ల ఇంచార్జ్‌ల‌ను నియ‌మించారు.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. పార్ల‌మెంటు, అసెంబ్లీ ప‌రిధిలో ఎవ‌రి ప‌నులు వారు చేసుకుంటార‌ని.. పార్టీని ప‌రుగులు పెట్టిస్తార‌ని.. చంద్ర‌బాబు భావించారు. అయితే.. ఇంకా నేత‌లు మిగిలిపోవ‌డం.. పార్టీలో అసంతృప్తి సెగ‌లు క‌నిపిస్తుండ‌డంతో చంద్ర‌బాబు మ‌రో వ్యూహానికి తెర‌దీశారు. ఈ క్ర‌మంలో అసెంబ్లీ స్థాయిలో నియోజ‌క‌వ‌ర్గం ప‌రిశీల‌కుల‌ను నియ‌మించారు. వీరు ఇంచార్జులు కారు. కేవ‌లం అక్క‌డ ఏం జ‌రుగుతోంది? పార్టీకోసం ఎవ‌రు ప‌నిచేస్తున్నారు? ఏం చేస్తున్నారు? అధికార పార్టీ దూకుడుకు స‌రైన విధంగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నామా? లేదా? నేత‌లు ఎవ‌రితోనైనా మిలాఖ‌త్ అయి.. పార్టీ ఉసురు తీసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారా? వంటి కీల‌క బాధ్య‌త‌ల‌ను చంద్ర‌బాబు అప్ప‌గించారు.

ఇలా.. ప‌రిశీల‌కులుగా నియ‌మితులైన వారు నేరుగా నేత‌ల నిర్ణ‌యాల్లో వేలు పెట్ట‌కూడ‌దు. అంతేకాదు.. వారితో క‌లిసిపోయి.. ప‌నులు చేయాలి. పార్టీ త‌ర‌పున అవ‌స‌ర‌మైతే… నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జుల‌కు స‌ల‌హాలు, సూచ‌న‌లు చేయొచ్చు. అదేస‌మయం లో అధిష్టానం క‌నుస‌న్న‌ల్లో నియోజ‌క‌వ‌ర్గం కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించేలా ప్రోత్స‌హించాలి. అయితే.. ఈ విధుల‌ను చాలా మంది ప‌క్క‌న పెడుతున్నారు. తామే ఇంచార్జ్‌ల‌మ‌న్న‌ట్టుగా చ‌క్రాలు తిప్పుతున్నారు. దీంతో ఇంచార్జ్ వ‌ర్సెస్ ప‌రిశీల‌కుల‌కు మ‌ధ్య రాజ‌కీయ ఆధిప‌త్య హోరు పెరిగిపోయింది.

దీంతో చంద్ర‌బాబు సొంత జిల్లాలోనే.. నాయ‌కులు వీధి పోరాటాల‌కు దిగే ప‌రిస్థితి వ‌చ్చింది. అదేవిధంగా క‌ర్నూలు, నెల్లూరు, అనంత‌పురం, కృష్ణా ఇలా.. సుమారు 6 నుంచి 7 జిల్లాల్లో ఇంచార్జ్‌లు నామ‌మాత్రం అయిపోయారు. ఫ‌లితంగా పార్టీ త‌ర‌ఫున గ‌ట్టిగా ప‌నిచేసేందుకు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. పైగా.. ప‌రిశీల‌కుల‌తో మాటా మాటా పెరిగి.. పార్టికి ఎఫెక్ట్ గా మారిపోయింది. ప‌ద‌వులు లేవ‌ని నిన్న మొన్న‌టి వ‌ర‌కు పార్టీ కార్యాల‌యాల చుట్టూ చ‌క్క‌ర్లు కొట్టిన నాయ‌కులు.. నేడు.. ప‌ద‌వులు రాగానే ఆధిప‌త్య ధోర‌ణుల‌కు పోతుండ‌డం భ‌విష్య‌త్తులో పార్టీకి ఇబ్బందేన‌ని అభిమానులు వాపోతున్నారు. మ‌రి.. చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి.