ఆ వైసీపీ సీనియ‌ర్ కేబినెట్లోకా.. రాజ్య‌స‌భ‌కా.. జ‌గ‌న్ డెసిష‌న్‌పై టెన్ష‌న్‌…!

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనాపరమైన నిర్ణయాలను వేగవంతం చేస్తున్నారు. ఉగాది నుంచి కొత్త జిల్లాలతో పాలన ప్రారంభించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం అధికారులకు కార్యాచరణ కూడా నిర్దేశించారు. వచ్చే నెలలో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే మూడు రాజధానులు బిల్లును సైతం తిరిగి ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే జగన్ ముఖ్యమంత్రిగా కొలువుదీరి మూడేళ్లు పూర్తవుతోంది.

ఈ నేపథ్యంలోనే కేబినెట్లో మార్పులు.. చేర్పులు చేసి ఎన్నికల డ్రీమ్ క్యాబినెట్ తో 2024 ఎన్నికలకు వెళ్లాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. మే 30వ తేదీ తర్వాత ఎప్పుడైనా క్యాబినెట్ ను విస్త‌రిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో 90% మంది మంత్రులను మార్చేసి వారి స్థానంలో కొత్త వారిని తీసుకుంటారని తనకు బాగా కావాల్సిన మంత్రులతో పాటు సీనియర్లలో ఇద్దరు ముగ్గురు మంత్రులను మాత్రమే కొనసాగిస్తారని తెలుస్తోంది. ఇక గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత… చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ కు జగన్ హామీ ఇచ్చినట్టు మంత్రి పదవి వస్తుందా లేదా ? అన్నది పెద్ద సస్పెన్స్ గా ఉంది.

2019 ఎన్నికల్లో చిలకలూరిపేట సీటు త్యాగం చేసినందుకు మర్రిని ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేస్తానని జగన్ స్వయంగా హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు. ఎన్నో సార్లు ఆయన ఎమ్మెల్సీ అయిపోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుందే తప్ప ఇప్పటి వరకు ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. కమ్మ సామాజిక వర్గం నుంచి కృష్ణా జిల్లాలో మంత్రిగా ఉన్న కొడాలి నానిని కొన‌సాగిస్తారా లేదా కొడాలిని మంత్రిగా కొనసాగిస్తూ… గుంటూరు జిల్లా కోటాలో మ‌ర్రికి మంత్రి పదవి ఇస్తారా ? అన్నది చూడాలి.

ఒకవేళ మర్రికి మంత్రి పదవి దక్కక పోతే త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికలలో కమ్మ సామాజిక వర్గం నుంచి ఆయన్ను రాజ్యసభకు పంపుతారని అంటున్నారు. మరి జగన్ హామీ ఇచ్చినట్టు మర్రి జ‌గన్ ఎన్నిక‌ల డ్రీమ్ క్యాబినెట్ లో కి వెళ్తారా లేదా ? పెద్దల సభకు వెళతారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.