యూపీలో ‘మూడు’ ముక్కలాట

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఉత్తర ప్రదేశ్ పై ప్రత్యేకంగా ద్రుష్టి సారించారు. ఆల్రెడీ అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. యోగి ఆదిత్యనాథ్ హైకమాండ్ ఆదేశాల మేరకు పాలన సాగిస్తున్నారు. యోగి పాలనపై పెద్దగా వ్యతిరేకత లేదు.. అయితే సీట్లు మాత్రం తగ్గే అవకాశముందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో డిల్లీలోని కమలం గ్యాంగ్ అప్రమత్తం అయింది. అరె.. యూపీలో ఓట్లు తగ్గినా.. అనుకున్న సీట్లు రాకపోయినా.. పొరపాటున అధికారం చేజారినా దేశవ్యాప్తంగా మోదీ పరువు గంగలో కలిసిపోతుందని భయపడుతోంది. అందుకే ఢిల్లీ నుంచి ప్రత్యేక టీమ్ యూపీ ఎన్నికల కోసం అప్పుడే కసరత్తు మొదలెట్టింది. ఇందులో భాగంగానే రైతు చట్టాలను రద్దు చేయడం నిర్ణయం అని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. యూపీలో రైతు చట్టాలను అక్కడి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకే వాటని రద్దుచేసి రైతుల వద్దకు వెళ్లాలని నిర్ణయించారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ కూడా యూపీ పర్యటనలు జోరుగా చేస్తున్నారు. ఏ ప్రాంతంలోనూ తమకు వ్యతిరేక పవనాలు వీచకుండా ఓ టీమ్ నే హైకమాండ్ ఏర్పాటు చేసింది. పార్టీలో నెంబర్ 2 అయిన అమిత్ షా కూడా ఇందులో భాగస్వామ్యమయ్యారు.

మూడు విభాగాలు.. ఒక్కొక్కరికి ఒక్కో ప్రాంతం

భారతీయ జనతా పార్టీ పొలిటికల్ టీమ్ ఉత్తర ప్రదేశ్ ను మూడు జోన్లుగా విభజించింది. ఒక్కో జోన్ కు ఒక్కొక్కరిని నియమించి అక్కడ విజయ బాధ్యతలు మొత్తం వారిపైనే ఉంచింది. ఈ ముగ్గురిలో అమిత్ షా.. రాజ్ నాథ్ కూడా ఉన్నారు. పశ్చిమ యూపీ ప్రాంతాన్ని షాకు అప్పగించారు. అక్కడ 140 సీట్లున్నాయి. ఇక్కడ అత్యధిక స్థానాలు గెలుచుకుంటేనే అధికారం చేజిక్కించుకోవచ్చు. వ్యూహ చతురుడైన షాకు కావాలనే ఈ జోన్ అప్పగించారు. జాట్లు, గుజ్జర్లను కమలం వైపు తిప్పుకోవడానికి ఆయన పొలిటికల్ మైండ్ ఉపయోగపడుతుందనేది ప్లాన్. ఇక వారణాసి, అవధ్ ప్రాంతాన్ని పార్టీలో సూపర్ సీనియర్ అయిన రాజ్ నాథ్ సింగ్ కు అప్పగించారు. రాజకీయ వ్యూహరచనలో ఉద్ధండుడైన రాజ్ నాథ్ పార్టీ సూచించిన మేరకు తన శక్తియుక్తుల మేర విజయం కోసం పాటుపడతాడని కమలం హైకమాండ్ భావిస్తోంది. ఆ తరువాత మూడో ప్రాంతమైన కాన్పూర్, గోరఖ్ పూర్ జోన్ ను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్ కు కట్టబెట్టారు.