షర్మిలకు నిరాశ మిగిల్చిన విజయమ్మ ఆత్మీయ సమ్మేళనం..

అన్నను కాదని.. తెలంగాణలో పార్టీ ప్రారంభించి.. జనంలోకి వెళుతున్న షర్మిల పార్టీ వైటీపీకి అనుకున్నంత మైలేజీ రావడం లేదు. ప్రశాంత్ కిశోర్ సలహాలిస్తున్నా ఎందుకో షర్మిల రాజకీయంగా వెనుకబడే ఉన్నారని చెప్పవచ్చు. అందుకే కాస్త పొలిటికల్ మైలేజ్ తెచ్చుకునేందుకు వైఎస్ఆర్ వర్ధంతిని ఉపయోగించుకుందామని ఎవరో సలహా ఇచ్చినట్లున్నారు. అనునకున్నదే ఆలస్యం.. హైదరాబాదులో వైఎస్ఆర్ ఆత్మీయులతో సమావేశం నిర్వహించారు వైసీపీ అధ్యక్షురాలు విజయమ్మ. కార్యక్రమమైతే జరిగింది.. నాయకులు, మేధావులు మాట్లాడారు.. అయితే అనుకున్న ప్రచారం రాలేదు.. పెద్దగా ప్రయోజనమూ లేదు. దీంతో ఏం చేయాలో అర్థంకాక వైటీపీ తలపట్టుకుంటోంది. తెలంగాణ మీడియాలో ప్రధాన రాజకీయ పార్టీల నాయకుల పేర్లతో పాటు తన పేరూ చూసుకోవాలని షర్మిల భావిస్తోంది. దీంతో జనంలోకి దూసుకెళ్లేందుకు యత్నిస్తున్నా ఫలితం రావడం లేదు. అందులో భాగమే నిరుద్యోగ దీక్ష.. ప్రతి మంగళవారం రాష్ట్రంలో ఏదో ఒక చోట ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబానికి సంఘీభావం తెలుపుతూ దీక్ష చేస్తోంది. ఈమె చేస్తున్న దీక్షకు సర్కారు నుంచి పెద్దగా స్పందించలేదు.. మీడియా కూడా పట్టించుకోవడం లేదు. అందుకే సరికొత్త ప్లాన్ వేసినట్లు సమాచారం.

త్వరలో పాదయాత్ర ప్రారంభం

రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పాదయాత్ర చేయాలని షర్మిల భావిస్తున్నారట. అక్టోబర్ 18న ఈ యాత్ర చేపట్టి దాదాపు 100 రోజుల పాటు రాష్ట్రంలో ప్రజలను కలుసుకోవాలనేది పొలిటికల్ ప్లాన్. 2012లో చేపట్టిన పాదయాత్ర కూడా అక్టోబర్ 18నే ప్రారంభించారు.