బిగ్‌బాస్ ఆట షురూ.. ఫస్ట్ వీక్ నామినేషన్లలో బయటపడ్డ బండారం!

టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో ‘బిగ్‌బాస్ సీజన్ 5’ ఎట్టకేలకు ప్రారంభం అయ్యింది. ఈ గేమ్ షోను మరోసారి అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తుండటంతో ఈసారి బిగ్‌బాస్ ఎలాంటి రికార్డును క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా సెప్టెంబర్ 5న ఘనంగా ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్ 5 షోలో 19 మంది కంటెస్టెంట్లను ఫైనల్ చేశారు నిర్వాహకులు. టీవీ, సినిమా తదితర రంగాలకు చెందిన పలువురు సెలబ్రిటీలను ఈసారి హౌజ్‌లోకి తీసుకున్నారు. ఇక ఆట మొదలైన తొలి వారంలో ఎవరు నామినేట్ అవుతారనే అంశంపై అందరిలో ఆసక్తి నెలకొంది.

అయితే ఈ విషయంపై షో నిర్వాహకులు తాజాగా ఓ ప్రోమో వీడియోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ఇంటిలోని ఐదుగురు కంటెస్టెంట్లు ఈవారం నామినేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో ఆర్జే కాజల్, యాంకర్ రవి, హమీదా, జస్వంత్ పడాల, మానస్ నామినేట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక వీరిని హౌజ్‌మేట్స్ ఏయే కారణాల వల్ల నామినేట్ చేశారనేది సోమవారం నాటి ఎపిసోడ్‌లో ప్రేక్షకులు తెలుసుకోనున్నారు. అయితే ఈ ప్రోమోలో హౌజ్‌మేట్స్ తెలిపే కారణాలను చూపించే ప్రయత్నం చేశారు నిర్వాహకులు.

మొత్తానికి బిగ్‌బాస్ ఫస్ట్ వీక్ నామినేషన్స్‌లో కంటెస్టెంట్స్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేసే ప్రయత్నం చేశారు నిర్వాహకులు. ఏదేమైనా తొలిరోజు అదిరిపోయే టీఆర్పీతో దూసుకుపోయిన బిగ్‌బాస్ ఇక తొలి వారంలోనూ తన సత్తా చాటేందుకు అప్పుడే ప్రణాళిక రూపొందించాడని చెప్పాలి. మరి ఈవారం నామినేషన్లో ఎవరు నిలుస్తారో, ఈ సీజన్ తొలి ఎలిమినేషన్ ఎవరు అవుతారో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.