వచ్చేనెల వస్తుందా? రాదా? జగన్ అన్న…

జూన్ నెలలో 61.46 లక్షల మంది, జులైలో 60.95 లక్షలు, ఆగస్టులో 60.50 లక్షలు, సెప్టెంబరులో 59.18 లక్షలు.. ఇదీ ఈ సంవత్సరం లెక్క.. ఈ గణాంకాలను గమనిస్తే ప్రతినెలా తగ్గుతున్నాయి అని ఎవరైనా చెప్పగలరు. ఏమిటివి అంటే.. ఏపీ ప్రభుత్వం ప్రతినెలా చెల్లిస్తున్న పెన్షన్ల సంఖ్య. నెలనెలా పెన్షన్లలో కోత విధిస్తుంటే లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. వచ్చేనెల ఖర్చులకు గ్యారేంటీగా పెన్షన్ వచ్చే పరిస్థితి ఇపుడు రాష్ట్రంలో కనిపించడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోవడంతో జగన్ సర్కారు సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో కోత విధిస్తోంది.

పథకాలను ఆపకపోయినా వాటిని పొందేవారిని మాత్రం తగ్గిస్తోంది. ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో ఏం చేయాలో పాలుపోక ఖర్చులు తగ్గించుకునేందుకు, మిగతా పథకాలకు కోత విధించిన సొమ్మును సర్దేందుకు సర్కారు ఈ ప్లాన్ అమలు చేస్తోంది. పెన్షన్ అందుకుంటున్న వారి వివరాలను వాలంటీర్ల ద్వారా మరోసారి సేకరించి.. వారి జీవన శైలిని గమనించి పెన్షన్ కట్ చేస్తున్నారు. నెలనెలా పెన్షన్లలో కోత విధిస్తుండటంతో ప్రతిపక్ష పార్టీలు సర్కారు తీరుపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఎందుకు తొలగించారని ప్రశ్నిస్తే.. అనర్హులను తొలగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగమున్నా, మరొకరికి పెన్షన్ వస్తున్నా అనర్హులుగా ప్రకటిస్తూ పొదుపు మంత్రం పాటిస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ పొదుపు చర్యలు లబ్ధిదారుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. అధికారం చేపట్టిన తరువాత ప్రతి సంవత్సరం రూ.250 వరకు పెంచుతామని చెప్పిన జగన్ ఆ విషయం గురించి అసలే మాత్రం మాట్లాడటం లేదు. మీరు పెంచకపోయినా పర్లేదు కాదు.. మా పేర్లు మాత్రం తీసేయకండి అని లబ్ధిదారులు కోరుకుంటున్నారు.