అన్నాచెల్లెళ్లు.. దూరం.. దూరంగా ఉంటున్న షర్మిల, కవిత…

వైఎస్ఆర్, కేసీఆర్ ఇద్దరూ రాజకీయ సమకాలీకులే.. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నపుడు వైఎస్ఆర్ ఓ వెలుగు వెలిగారు. కేసీఆర్ కూడా అంతే.. రాష్ట్రం విడిపోయిన తరువాత ఆయనదే హవా.. ఇక కుటుంబపరంగా చూస్తే ఇద్దరికీ సారూప్యత ఉంది. ఇద్దరికీ ఇద్దరు పిల్లలు. ఓ కుమారుడు, ఓ కుమార్తె. వైఎస్ఆర్ కు జగన్, షర్మిల సంతానమైతే.. కేసీఆర్ కు కేటీఆర్, కవిత. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇపుడు పిల్లల విషయానికి వస్తే ఏపీలో జగన్ టాప్ లీడర్.. తెలంగాణలో కేసీఆర్ తరువాత కేటీఆరే.. అక్కడ వైఎస్ లేరు కాబట్టి జగన్ రాజకీయంగా ఎదిగారు అంతే.. తేడా.. లేకపోతే ఇద్దరూ ఇద్దరే.

ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఇరు కుటుంబాల్లోని అన్నాచెల్లెళ్ల మధ్య ఎందుకో అభిప్రాయభేదాలు వచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాదు.. అవి తీవ్రాతితీవ్రంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఊహాగానాలు నిజమే అనుకునేలా ఉన్నాయి అన్నాచెల్లెళ్ల ప్రవర్తన.

జగన్, షర్మిల

ఏపీలో వైసీపీ కోసం కష్టపడ్డ వారిలో జగన్ తరువాత వినిపించే పేరు షర్మిలనే. పార్టీ ప్రారంభించినప్పటి నుంచీ అన్నకు అండగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంది. అక్రమ ఆస్తుల కేసులో జైలుకు వెళ్లినపుడు పార్టీని ఒంటిచేత్తో ముందుకు నడిపింది. అన్న మధ్యలోనే వదిలేసిన ఓదార్పు యాత్ర ప్రారంభించింది. పార్టీకి వైభవం కోసం ఎన్నికల ముందు రాష్ట్రం ముందు తిరిగింది. జగన్ ఒకవైపు పార్టీని బలోపేతం చేస్తుంటే షర్మిల కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. పదునైన మాటలతో తెలుగుదేశం పార్టీని గుక్కతిప్పునివ్వుకోవడం లేదు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే.. అధికారం వచ్చిన తరువాత జగన్ పార్టీకి ఎందుకో షర్మిల దూరమైంది. దూరమైందా, దూరం పెట్టారా అనే విషయాలకంటే దూరమైంది అని పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు. వైసీపీ పవర్ లోకి వచ్చిందంటే షర్మిల పాత్ర కూడా ఉందనేది బహిరంగ రహస్యం. అయితే ఎందుకో మరి చెల్లెమ్మను అన్నయ్య సైడ్ చేశాడు. ప్రమాణ స్వీకార కార్యక్రమాల అనంతరం షర్మిలకు పార్టీలోకానీ, ప్రభుత్వంలోకానీ పెద్దపీట వేస్తారని అందరూ భావించారు. రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని కూడా అనుకున్నారు. అయితే ఇవేవీ జరగలేదు. కాలక్రమేణా అన్నాచెల్లెళ్లు దూరమయ్యారు. ఎంత దూరమయ్యారంటే రక్షా బంధన్ కు కలుసుకోలేనంత.. నాన్నగారి వర్ధంతి, జయంతి కార్యక్రమాల్లో మాట్లాడుకోలేనంత.. ఆ పెరిగిన దూరమే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టేందుకు కారణమై ఉండవచ్చని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.

కేటీఆర్, కవిత

తెలంగాణలో కేసీఆర్ తరువాత..? అనే ప్రశ్నకు సమాధానమే కేటీఆర్. పార్టీలోనూ, ప్రజల్లోనూ మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ట్విట్టర్ లో మూడు మిలియన్ల మంది ఫాలో అవుతున్నారంటే

ఆయనకున్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. మరి అటువంటి నాయకుడి చెల్లెమ్మ కవిత మాత్రం ఎందుకో అన్నకు దూరంగా ఉంటోంది. ఆ దూరానికి మాత్రం కారణం ఎవరికీ తెలియడం లేదు. ఎంపీగా ఓటమి పాలైన అనంతరం ఎమ్మెల్సీగా విజయం సాధించినా పార్టీలో పెద్దగా యాక్టివ్ గా లేదు. ఇపుడు హుజూరాబాద్ ఎన్నికలకూ దూరంగా ఉంటోంది. ఎమ్మెల్సీగా గెలిచిన తరువాత మంత్రి వర్గంలో స్థానం కోసం ప్రయత్నించిందని, బెర్త్ ఇవ్వడం కష్టమని చెప్పడం వల్లే ఇలా ముభావంగా ఉంటున్నట్లు సమాచారం. ఈ సంవత్సరం రాఖీడే కు కూడా కవిత అన్నకు ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. అయితే.. అన్న నుంచి మాత్రం రిప్లై లేదు.. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో టాప్ లీడర్ల చెల్లెళ్లు మాత్రం ఇలా పార్టీకి దూరంగా ఉండటం ప్రజల్లో చర్చనీయాంశమైంది. రాజకీయకారణాలవల్లే ఈ భేదాభిప్రాయాలు వచ్చినట్లు అందరూ అనుకుంటున్నారు.