ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టిన ప్రభుత్వం.. పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్ ..!

రెండు రోజులుగా ఏపీ ప్రభుత్వం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శల దాడి జరుగుతున్న సంగతి తెలిసిందే. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమ సమస్యలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రులపై అయితే సన్యాసి అంటూ వ్యాఖ్యలు చేశారు.

అయితే దీనికి కౌంటర్ గా మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి అంతే స్థాయిలో స్పందించారు. కాగా పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ట్వీట్ చేశారు. వైసీపీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, వాగ్దానాల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ అధికారంలోకి రాగానే మద్యపానాన్ని నిషేధిస్తామని ప్రకటించారు.. కానీ మద్యపానాన్ని ఎక్కడ నిషేధించారని ప్రశ్నించారు. కరెంటు చార్జీలను విపరీతంగా పెంచారని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ ఊసే లేదన్నారు. రాజధాని నిర్మాణం గురించి వైసీపీ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రతి ఏడాది జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారని, గ్రూప్ 1,అండ్ 2 , పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారని.. మరి జాబ్ క్యాలెండర్ విడుదల ఏదని, ఉద్యోగాల భర్తీ ఎప్పుడని ప్రశ్నించారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను ప్రభుత్వం నెరవేర్చకపోగా నవరత్నాల పథకాల అమలుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని  ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఏపీ అప్పులు దాదాపు రూ.4లక్షల కోట్లు ఉన్నాయని అన్నారు. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఈ మేరకు పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి ఓ ట్వీట్ చేశారు.

 

https://twitter.com/PawanKalyan/status/1442175763457839106?s=20